బిహార్‌లో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దంపతుల దారుణహత్య

నవతెలంగాణ – బిహార్
ప్రొఫెసర్లుగా పనిచేసి, పదవీ విరమణ పొందిన వృద్ధ దంపతులను బిహార్‌లో కిరాతకంగా హత్య చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఈ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్‌ మహేంద్రసింగ్‌ (70) బిహార్‌లోని ఆరా నగరంలో ఉన్న వీర్‌ కున్వర్‌సింగ్‌ యూనివర్సిటీ డీన్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యారు. ఈయన భార్య పుష్పసింగ్‌ (65) మహిళా కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. ఈ దంపతులిద్దరూ నవాడా పోలీస్‌స్టేషన్‌ పరిధి కటిరా ప్రాంతంలోని ఓ ఫ్లాటులో ఉంటున్నారు. లఖ్‌నవూలో ఉన్న ఓ కుమార్తె.. సోమవారం ఉదయం నుంచీ తండ్రికి ఫోను చేస్తున్నా స్పందన లేదు. దీంతో ఆమె తన స్నేహితురాలికి ఫోను చేసి విషయం చెప్పారు. స్నేహితురాలు ఫ్లాటుకు వెళ్లి చూడటంతో.. ఈ జంటహత్యలు వెలుగులోకి వచ్చాయి. మహేంద్రసింగ్‌ మృతదేహం భోజనాల గదిలో, పుష్పసింగ్‌ మృతదేహం పడకగదిలో పడున్నాయి. మృతదేహాలపై గాయాలు, రక్తపు మరకలు ఉన్నాయి. భోజ్‌పుర్‌ ఏస్పీ ప్రమోద్‌ కుమార్‌ యాదవ్‌, ఏఎస్పీ హిమాన్షు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love