బీఆర్‌ఎస్‌ నేతల అవినీతిని ప్రశ్నిస్తే భౌతిక దాడులా..?

–   బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజరు
–  పార్టీ నేతకు పరామర్శ
నవతెలంగాణ-బోడుప్పల్‌
అధికార పార్టీ తప్పిదాలను ప్రశ్నించినందుకే కార్యకర్తలపై పోలీసులను ఉసిగొల్పి భౌతిక దాడులకు పాల్పడుతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజరు అన్నారు. మేడ్చల్‌ జిల్లా పరిధిలోని పీర్జాదీగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని శ్రీ చైతన్య కళాశాల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడిన బీజేవైఎం మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు బండారు పవన్‌ రెడ్డిని మేడిపల్లి లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఆయన పరామర్శించారు.ఈ సందర్భంగా బండి సంజరు మాట్లాడుతూ పోలీసులు ప్రభుత్వ అధికారుల్లా కాకుండా కేసీఆర్‌ ఏజెంట్లుగా పని చేయడం సరైనది కాదన్నారు. బీఅర్‌ఎస్‌ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని గత వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో బీఅర్‌ఎస్‌ పార్టీ నేతలు పేకాట ఆడుతూ అడ్డంగా దొరికినా కూడా వారిపై చర్యలు తీసుకునే దైర్యం లేని పోలీసులు నేతల డ్రైవర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అదే ఘటనలో జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికే ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.పరామర్శించిన వారిలో బీజేపీ నేతలు పెద్ది మోహన్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పీ.విక్రం రెడ్డి, సామల పవన్‌ రెడ్డి,కుంభం కిరణ్‌ కుమార్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Spread the love