బీఆర్‌ఎస్‌ పాలనలో భద్రాద్రి గుర్తింపు కోల్పోయింది

–   శ్రీరాముడికి మాట ఇచ్చి మోసం చేసినోడు బాగుపడతాడా..
–  తెలంగాణలో బీజేపీ గెలిచేది లేదు..
–  వరంగల్‌ డిక్లరేషన్‌ అమలు చేస్తాం
–  రూ.500 లకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తాం: భద్రాచలంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-భద్రాచలం
శ్రీరాముడు నడయాడిన ప్రాంతం భద్రాచలం అని, గొప్ప చరిత్ర కలిగిన భద్రాచలం.. బీఆర్‌ఎస్‌ పాలనలో పూర్తిగా గుర్తింపు కోల్పోయిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌ రెడ్డి చేపట్టిన హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్ర మంగళవారం రాత్రి భద్రాచలం చేరుకుంది. ముందుగా అంబేద్కర్‌ సెంటర్లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. విభజించు.. పాలించు.. అనే విధానంతో దేశంలో బీజేపీ పరిపాలన సాగుతోందన్నారు. ఈ సందర్భంలో దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర చేశారని తెలిపారు. రూ.100 కోట్లతో శ్రీరాముని ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్న సీఎం హామీ ఏమయిందని ప్రశ్నించారు. గోదావరి వరద ముంపు బాధితులను ఆదుకుంటామని రూ.10వేలు ఇస్తానన్న సీఎం హామీ అమలుకాలేదని విమర్శించారు. శ్రీరాముడికి కనీసం తలంబ్రాలు ఇచ్చేందుకు కూడా కేసీఆర్‌ రాలేదని ఆరోపించారు. శ్రీరాముడికి మాట చెప్పి మోసం చేసినోడు బాగుపడతాడా అని కార్యకర్తల సమక్షంలో ప్రశ్నించారు. భద్రాచలాన్ని టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందన్నారు. కేసీఆర్‌ సీఎం అయ్యాకనే 7 మండలాలు ఆంధ్రాలో కలిపారని, భద్రాచలాన్ని కుట్రపూరితంగా మూడు ముక్కలు చేశారని విమర్శించారు. పినపాక నియోజకవర్గంలో రైతుల కష్టాలు చూసి చలించిపోయానన్నారు. సీతారామ ప్రాజెక్టు కోసం తీసుకున్న భూములకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడుపోతుందో తెలియడం లేదని రైతులు చెబుతున్నారని వాపోయారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. నిత్యవసర ధరల పెరుగుదలతో రోజు కూలీకి నూనె ప్యాకెట్‌ కూడా వస్తలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రౌండ్‌లో కాంగ్రెస్‌ లేదని బీజేపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని, భద్రాచలం వచ్చి చూడండి అని తెలిపారు. బోడి గుండుపై జుట్టు వచ్చేది లేదు.. తెలంగాణలో బీజేపీ గెలిచేది లేదని స్పష్టంచేశారు. ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి రూ.5లక్షలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. కౌలు రైతులకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని, వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌, భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య తదితరులు ప్రసంగించారు. పాదయాత్రలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కొత్తగూడెం కాంగ్రెస్‌ నాయకులు ఎడవెల్లి కృష్ణ, భద్రాచలం కాంగ్రెస్‌ నాయకులు బడగం శ్రీనివాస్‌, నల్లపు దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love