బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ ఖాయం

– మూడోసారీ కేసీఆరే సీఎం
– మెట్రో మూడోదశ పనులు చేపడతాం : మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హ్యాట్రిక్‌ విజయం సాధించడం ఖాయమని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. అప్పుడు మూడో దశ మెట్రో పనులను చేపడతామని హామీ ఇచ్చారు. ఆదివారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్‌ఎస్‌ సభ్యుడు యెగ్గె మల్లేశం ఈ అంశాన్ని లేవనెత్తారు. నాగోల్‌ నుంచి ఎల్బీ నగర్‌ వరకు మెట్రోరైలును విస్తరించే ప్రతిపాదన ఉందా?అని ఆయన ప్రశ్నించారు. ఎల్బీనగర్‌ నుంచి పెద్దఅంబర్‌పేట లేదా రామోజీ ఫిల్మ్‌సిటీ వరకు మెట్రో సర్వీసులను పొడిగించాలని కోరారు. మంత్రి కేటీఆర్‌ సమాధానమిస్తూ మొదటిదశలో 69 కిలోమీటర్ల వరకు మెట్రోరైలు సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రెండోదశలో 62 కిలోమీటర్ల మేర మెట్రోరైలును విస్తరిస్తామని వివరించారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వందశాతం పనులను రూ.6,250 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి చేస్తామని అన్నారు. ఇందులో కేంద్ర సహకారం ఏమీ లేదన్నారు. మూడేండ్లలో దీన్ని పూర్తి చేస్తామని చెప్పారు. తద్వారా కాలుష్యం, సొంత కార్ల వినియోగం తగ్గుతుందని వివరించారు. రెండోదశలోనే బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డికాపూల్‌ వరకు, నాగోల్‌ నుంచి ఎల్బీ నగర్‌ వరకు మెట్రోరైలును విస్తరించే పనులు చేపడతామన్నారు.
111 జీవో పరిధిలోని నిర్మాణాలపై
త్వరలో నిర్ణయం
రాష్ట్రంలో 1985, జనవరి ఒకటి నుంచి 2015, అక్టోబర్‌ 28 వరకు నిర్మితమైన అనధికార నిర్మాణాలు, అతిక్రమణలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. శాసనమండలిలో ఈ అంశాన్ని అధికార పార్టీ సభ్యుడు రాజేశ్వర్‌రావు లేవనెత్తారు. మంత్రి సమాధానమిస్తూ మున్సిపాల్టీల్లో 41,493, జీహెచ్‌ఎంసీలో 1,38,630, హెచ్‌ఎండీఏలో 32,258 కలిపి మొత్తం 2,12,381 దరఖాస్తులొచ్చాయని వివరించారు. బీఆర్‌ఎస్‌ పథకాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో సుపరిపాలన ఫోరం పిల్‌ వేసిందన్నారు. ఈనెల 16న దీనిపై విచారణ ఉందని అన్నారు. హైకోర్టు కేసును పరిష్కరించిన తర్వాత బీఆర్‌ఎస్‌ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో కట్టుకున్న ఇండ్లను క్రమబద్ధీకరించేందుకు 58 జీవో, కబ్జాలో ఉన్న భూములను క్రమబద్ధీకరించేందుకు 59 జీవోను ప్రభుత్వం విడుదల చేసిందని గుర్తు చేశారు. లంచం ఇవ్వనిదే ఇంటి నిర్మాణానికి అనుమతి రాదనే పరిస్థితి గతంలో ఉండేదని చెప్పారు. అందుకే టీఎస్‌ఐపాఎస్‌ తరహాలో భవన నిర్మాణాల అనుమతి కోసం టీఎస్‌బీపాస్‌ను తెచ్చామన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ దాన్ని మెచ్చుకున్నారని వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 రోజుల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నామని అన్నారు.
టీఎస్‌బీపాస్‌ నిబంధనల మేరకే భవన నిర్మాణాలుంటాయని వివరించారు. గృహనిర్మాణ శాఖను రద్దు చేసి, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ పనులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల కోరిక మేరకు 111 జీవో స్థానంలో 69 జీవోను తెచ్చామని అన్నారు. హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ కాలుష్యం కాకుండా పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడతామని వివరించారు. అయితే 111 జీవో పరిధిలో గతంలో నిర్మాణాలు చేపట్టిన వాటిని ఏం చేయాలన్న దానిపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందన్నారు. ధరణి వచ్చాక భూమి ఎక్కడున్న నమోదవుతుందని చెప్పారు. ఏమైనా సందేహాలుంటే లిఖితపూర్వంగా ఇస్తే పరిశీలిస్తామని సభ్యులను కోరారు.
జీఎస్టీ పరిహారంపై కోర్టుకెళ్తాం : తలసాని
జీఎస్టీ పరిహారం చెల్లించాలంటూ కోర్టును ఆశ్రయిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించా రు. వెంటనే ఆ పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జీఎస్టీ కింద ఇప్పటి వరకు రూ.16,570. 42 కోట్ల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందిందని వివరించారు. ఇంకా రూ.2,433.41 కోట్ల బకాయిలు విడుదల కావాల్సి ఉందన్నారు. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు రూ.1,371.76 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,061.65 కోట్లు చెల్లించాలం టూ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని గుర్తు చేశారు. ఇది రాష్ట్రాలకు రావాల్సిన హక్కని చెప్పారు. కానీ కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. కేంద్రం మెహర్బానీ చూపిస్తున్నదనీ, రాష్ట్రాలకు బిచ్చం వేస్తున్నట్టు వ్యవహరిస్తున్నదని అన్నారు. ఇది సరైన వైఖరి కాదన్నారు. పాలమీద జీఎస్టీ వేస్తూ పేదలను పీడిస్తున్నదని విమర్శించారు.
దశలవారీగా గురుకులాలకు
శాశ్వత భవనాలు : కొప్పుల
రాష్ట్రంలోని 1,002 గురుకులాలకు దశలవారీగా శాశ్వత భవనాలను నిర్మిస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. ఏటా కొన్ని గురుకులాల భవనాలు నిర్మించాలనే ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. తెలంగాణ రాకముందు 298 గురుకులాలుండేవని అన్నారు. ప్రస్తుతం 1,002 గురుకులాల్లో 5.31 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. అయితే గురుకులాల్లో పనివేళలు వేర్వేరుగా ఉన్న మాట వాస్తవమేననీ, అన్ని శాఖల మంత్రులు చర్చించి వాటిని సరిచేస్తామని అన్నారు. వాటిలో టీచరే వార్డెన్‌ విధులు నిర్వహిస్తారని చెప్పారు. ఇబ్బంది అవుతుందంటూ ఎక్కడా ఫిర్యాదులు రాలేదన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌
పూర్తిగా చెల్లించాం : గంగుల
రాష్ట్రంలో ఫీజురీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిల్లేవనీ, పూర్తిగా చెల్లించామనీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. 2021లో బీసీ, ఈబీసీ విద్యార్థులు 4,23,829 మంది దరఖాస్తు చేసుకుంటే 3,55,885 మందికి రూ.314.14 కోట్లు చెల్లించామని వివరించారు. 2019-20లో బీసీ, ఈబీసీ విద్యార్థులు 7,36,666 మంది దరఖాస్తు చేస్తే, 7,31,167 మందికి రూ.1,017.37 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు చెల్లించామని అన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 1.36 కోట్ల మంది విద్యార్థులకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.

Spread the love