- బీహార్‌లో అమానుషం
పాట్నా : రైతులపై పోలీసులు కర్కశంగా విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వారిని దారుణంగా కొట్టారు. బ్రిటీష్ వారిని తలదన్నేలా పోలీసులు తమ క్రూరత్వాన్ని చూపారు. బీహార్‌లోని బక్సర్ జిల్లాలో నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ కోసం బనార్‌పూర్ గ్రామ రైతుల నుంచి భూములు సేకరించారు. ఈ భూములకు మెరుగైన ధర చెల్లించాలని నిరసనకు దిగిన రైతులపై వీరంగం సృష్టించారు. ఈ భూములు బీహార్ రాజధాని పాట్నాకు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 1320 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ గత ఏడాది నుంచి నిర్మాణంలో ఉంది. ఆ ప్లాంట్ కోసం సేకరించిన భూములకు 12 ఏండ్ల క్రితం నిర్ణయించిన ధరలను సవరించాలని రైతులు ఈ నిరసన చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో పోలీసులు తలుపులు బద్దలుకొట్టి దూసుకురావడంతో పాటు మహిళలపై కూడా దాడిచేసినట్లు కనిపిస్తోంది. ముఫాసిల్ పోలీసు స్టేషన్‌లోని సీనియర్ అధికారి అమిత్ కుమార్ ఈ దాడికి సూత్రధారుడని రైతులు పేర్కొన్నారు. యథావిధిగా బుధవారం కూడా పవర్ ప్లాంట్ ఎదుట శాంతియుతంగా నిరసన చేపట్టామని రైతులు పేర్కొన్నారు. మార్కెట్ ధరలను అనుసరించి తమ భూముల ధరలను సవరించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.