భోపాల్: మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా మాండవి గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఎనిమిదేండ్ల బాలుడు మృతిచెందాడు. ఈ నెల 6న తన్మయ్ సాహూ (8) అనే బాలుడు పొలంలో ఆడుకుంటూ 400 అడుగుల లోతున్న బోరుబావిలో జారిపడిన విషయం తెలిసిందే. 50 అడుగుల లోతులో చిక్కుకున్న ఆ బాలుడిని రక్షించేందుకు నాలుగురోజులపాటు అధికారులు చేసిన కృషి ఫలించలేదు. బోరుబావిలోకి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. బోరు బావికి సమాంతరంగా సొరంగం తొవ్వి బాలుడిని బయటకు తీశారు. అయితే అతడు అప్పటికే ఊపిరివదిలాడు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. నాలుగు రోజులపాటు నిర్విరామంగా ప్రయత్నించినప్పటికీ బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోయామని చెప్పారు. బాలుడి మృతి పట్ల సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తంచేశారు.