బ్యాంకింగ్‌ వ్యవస్థలో తిరోగమన విధానాలు

– నిర్వీర్యం చేస్తున్న మోడీ సర్కారు
– సవాళ్లు ఎదుర్కొంటున్న ఉద్యోగులు
– ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు బ్యాంకుల జాతీయీకరణ దోహదం
– 30, 31న దేశవ్యాప్త సమ్మె వాయిదా
– ఏఐబీఈఏ జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం
నవతెలంగాణ-ముషీరాబాద్‌
భారత దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే జాతీయ బ్యాంకులను కేంద్రంలోని మోడీ సర్కార్‌ నిర్వీర్యం చేస్తున్నదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.వెంకటాచలం అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో శనివారం యూనియన్‌ బ్యాంకు అవార్డు ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర 2వ వార్షిక మహాసభ ఘనంగా ప్రారంభమైంది. తొలుత ఏఐబీఈఏ పతాకాన్ని సిహెచ్‌.వెంకటాచలం ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్యాంకుల జాతీయీకరణ దేశంలోని సాధారణ పౌరులు సురక్షితమైన బ్యాంకింగ్‌ వ్యవస్థపై ఆధారపడటానికి సహాయపడిందన్నారు. అలాగే వ్యవసాయం, విద్య, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వంటి రంగాలకు బ్యాంకులు ప్రాధాన్యతారంగ రుణాలు అందించడంలో కూడా జాతీయీకరణ దోహదం చేసిందని తెలిపారు. అలాంటి బ్యాంకులను నేడు నిరంకుశంగా ప్రధాని మోడీ ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐబీఈఏ చరిత్రను వెనక్కి తిరిగి చూసుకుంటే గొప్ప గర్వం, స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఈ సంఘంలో సాధారణ మధ్యతరగతి బ్యాంక్‌ ఉద్యోగుల ప్రయాణం, వారి సంపూర్ణ ఐక్యత ద్వారా గౌరవం, భద్రత, మెరుగైన జీవన పరిస్థితులను పొందవచ్చునని తెలిపారు. ఆర్థిక సంస్థల్లో దివాలా, ఎన్‌.పీ.ఏల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రధాని మోడీ సామాన్య ప్రజల సంక్షేమాన్ని విస్మరించి.. కొంతమంది కార్పొరేట్‌ మిత్రుల సంక్షేమం కోసమే కట్టుబడి ఉన్నారని విమర్శించారు. తిరోగమన విధానాల వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని, అందులో ఉద్యోగ భద్రత ఒకటని తెలిపారు. బ్యాంకులు, బీమా, బొగ్గు గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వరంగ ఉద్యోగులు పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. జనవరి 31న యూనియన్లతో సమావేశం నిర్వహించేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ అంగీకరించిందని, దాంతో 30, 31 తేదీల్లో దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెను వాయిదా వేసినట్టు తెలిపారు. ఐదు రోజుల బ్యాంకింగ్‌, పెన్షన్‌ అప్‌డేట్‌, అవశేష సమస్యలు, నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) రద్దు చేయడం, వేతన సవరణ కోసం డిమాండ్‌ల చార్టర్‌పై ఐబీఏతో యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ చర్చలు జరుపుతుందని వెల్లడించారు. ప్రతినిధుల సభకు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి సమద్‌ ఖాన్‌ స్వాగతం పలుకగా, అధ్యక్షులు టి.రవీంద్రనాథ్‌ అధ్యక్షత వహించారు. మహాసభ ఆహ్వాన సంఘం చైర్మెన్‌ బి.ఎస్‌.ఆర్‌.మోహన్‌ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. యూనియన్‌ బ్యాంకు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సురేష్‌ చంద్రటెలి, ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బి.ఎస్‌.రాంబాబు, అఖిల భారత యూనియన్‌ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌.శంకర్‌, చైర్మెన్‌ విన్‌ సెంట్‌ డిసౌజా, ఏపీ యూనియన్‌ బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వి.ఉదయ కుమార్‌, యూనియన్‌ బ్యాంకు రీజినల్‌ హెడ్‌లు పి.సత్యం, సీఎస్‌. జనని తదితరులు పాల్గొన్నారు.

Spread the love