– వారిపై పెరుగుతున్న వివక్ష
– మతమార్పిడి ఆరోపణలతో దాడులు
– ప్రభుత్వం వారికి భరోసానివ్వాలి
– ప్రధాని మోడీకి మాజీ ఉన్నతాధికారుల లేఖ
న్యూఢిల్లీ : దేశంలోని క్రిస్టియన్ సమాజంలో భయానక వాతావరణం నెలకొని ఉన్నదని మాజీ బ్యూరోకాట్లు ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై బలవంతపు మత మార్పిడి ఆరోపణలతో ఆ వర్గం ప్రజలు పూర్తి వివక్షను ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి 93 మంది మాజీ ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు లేఖ రాశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చట్టం, పరిపాలనా పరంగా క్రిస్టియన్ సమాజానికి భరోసానివ్వాలని లేఖలో వారు కోరారు. ప్రధానంగా క్రిస్టియన్ సమాజంపై ఉన్న ఆరోపణ బలవంతపు మార్పిళ్లు అనీ, 1951 జనాభా లెక్కల నుంచి చూస్తే మాత్రం ఇది దాదాపు 2.3 శాతంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ ఆరోపణతోనే క్రిస్టియన్ సమాజం భౌతికంగా, మానసికంగా, మాటల రూపంలో దాడులకు గురైందని వివరించారు. ఈ దాడులు వ్యక్తులు, వారికి చెందిన సంస్థల పైనా జరిగాయన్నారు. విద్యా, వైద్య రంగంలో, సామాజిక సంస్కరణల్లో క్రిస్టియన్ల సహకారాన్ని మాజీ ఉన్నతాధికారులు ఉటంకించారు. ఇప్పటికీ క్రిస్టియన్లతో పాటు అన్ని మైనారిటీల ప్రజలు తమ సొంత దేశంలో అనామకులుగా ఉంటున్నారని వివరించారు. వారి సొంత విశ్వాసాలను పాటించడంలో అపరాధ భావంతో ఉండాల్సిన పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అగ్రనాయకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక్క మాటతో మైనారిటీలపై హింసను ఆపగలమని మాజీ బ్యూరోకాట్లు వివరించారు.