భారతీయ సినీ మాదర్శకుడు ఎల్‌.వి. ప్రసాద్‌

      భారతీయ సినిమాకి నడకలు నేర్పిన ఎల్‌.వి. ప్రసాద్‌ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, సినిమాటోగ్రాఫర్‌గా చలన చిత్రరంగానికి ఎనలేని సేవ చేసిన మార్గదర్శకుడు. హిందీ, తమిళ, తెలుగు భాషలలో తెరకెక్కిన తొలి టాకీ చిత్రాలయిన ఆలం ఆరా, కాళిదాస్‌, భక్తప్రహ్లాద వంటి మూడు సినిమాల్లో నటించిన ఏకైక నటుడిగా ఎల్‌.వి ప్రసాద్‌ చరిత్రకెక్కాడు.
తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ఒక్కడే ఈ ఘనత సాధించాడు. ప్రసాద్‌ హిందీ, తమిళ, తెలుగు కన్నడ వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా పలు విధాలుగా తన పాత్రను పోషించారు. ఆయన భారతీయ సినీ రంగానికి ఎనలేని సేవలందించినందుకు గాను భారత ప్రభుత్వం దాదాసాహేభ్‌ ఫాల్కే అవార్డును ఇచ్చి సత్కరించింది. జనవరి 17న ఆయన జయంతి సందర్భంగా సోపతి పాఠకుల కోసం సందర్భోచిత వ్యాసం….
ఎల్‌.వి.ప్రసాద్‌గా ప్రసిద్ధి చెందిన అక్కినేని లక్ష్మీవర ప్రసాదరావు 1908 జనవరి 17న ఆంధ్రప్రదేశ్‌ ఏలూరు తాలూకాలోని సోమవరపాడు అనే మారుమూల గ్రామంలో అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ప్రసాద్‌ గారాబంగా పెరిగాడు. చురుకైన కుర్రవాడే అయినప్పటికి చదువు పట్ల శ్రద్ధ చూపలేదు. ఉరూరా తిరిగే నాటకాల కంపెనీలు, డాన్సు ట్రూపుల డప్పుల చప్పుల్లు ప్రసాద్‌ ను ఆకర్షించేవి. పాత అరిగిపోయిన సినిమా రీళ్ళను ప్రదర్శించే గుడారపు ప్రదర్శనశాలలకు తరచూ వెళ్ళి వాటిని ఆసక్తిగా చూసే వాడు. స్థానికంగా ప్రదర్శించే నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు. ఇదే ఆసక్తి పెద్దయ్యాక కదిలే బొమ్మలు, నటనపై పెరిగి సినిమా రంగంలో ప్రవేశించడానికి పునాదులు వేసింది. 1924లో తన 17 వ ఏటా తన మామ కుమార్తె సౌందర్య మనోహరమ్మను ప్రేమించి వివాహం చేసుకున్న ప్రసాద్‌ కొన్నాళ్ళకు కుటుంబంలో ఎవరికి చెప్పకుండా సినిమాల్లో నటించేందుకు బొంబాయి వెళ్ళాడు.
వంద రూపాయాలతో బొంబాయి నగరంలో అనామకుడిగా అడుగు పెట్టిన ప్రసాద్‌ వీనస్‌ ఫిల్మ్‌ కంపెనీలో చిన్నచిన్న పనులు చేసే సహాయకుడుగా జీవితాన్ని ప్రారంభించి, స్టార్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ఃః మూకీ చిత్రంలో అతిధి పాత్ర పోషించాడు. ఆ తర్వాత 1931లో విడుదలైన మొట్టమొదటి ఇండియా టాకీ సినిమా అర్దేశిర్‌ ఇరానీ ఇంపీరియల్‌ ఫిలిం కంపెనీ బ్యానర్‌పై రూపొందించిన ఃఆలం ఆరాఃలో ప్రసాద్‌ ఒక పాత్ర పోషించాడు. ఆ సమయంలో ఇంపీరియల్‌ ఫిలిం కంపెనీ ప్రసాద్‌కి నెలకి 30 రూపాయల వేతనం ఇచ్చింది. ఈ సమయంలో తెలుగువాడైన హెచ్‌.ఎం.రెడ్డి తో ఏర్పడిన పరిచేయంతో హెచ్‌.ఎం.రెడ్డి తాను నిర్మించిన మొదటి తమిళ టాకీ ఃకాళిదాస్‌ః తోపాటు మొదటి తెలుగు టాకీ ఃభక్త ప్రహ్లాదఃలో ప్రసాద్‌కు ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ఇలా మూడు భాషల్లో తెరకెక్కిన తొలి టాకీ సినిమాల్లో నటించే అవకాశం ఎల్‌.వి ప్రసాద్‌కి దక్కింది. కొంతకాలం తర్వాత అర్దెషిర్‌ ఇరాని స్థాపించిన ఇంపీరియల్‌ ఫిలిం కంపెనీ కొందరు ఉద్యోగులను తగ్గించినప్పుడు, ఆ ఉద్వాసన జాబితాలో ప్రసాద్‌ కూడా ఉన్నారు. అప్పుడు కృష్ణా సినిమాః (డ్రీమ్‌ల్యాండ్‌)లో డోర్‌ కీపర్‌ ఉద్యోగం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే హెచ్‌.ఎం.రెడ్డి నిర్మించిన ఃసావిత్రిః సినిమాలో సత్యవంతుడు వేషాన్ని వేశారు. హిందీలో హెచ్‌.ఎం.రెడ్డి ఃసీతాస్వయంవర్‌ః అనే చిత్రాన్ని డైరక్టు చేస్తున్నప్పుడు కంపెనీ వారితో విభేదాలు రావడంతో ఆయన తప్పుకున్నారు. ప్రసాద్‌ ఆ చిత్రం పూర్తయ్యేదాకా ఉండి, ఆ చిత్రానికి ప్రతినిధిగా సినిమా డబ్బాలు మోస్తూ బొంబాయి రాష్ట్రమంతా తిరిగాడు. తర్వాత న్యూ ఎరా అధిపతి రజనీకాంత పాండ్య నిర్మించిన మత్స్యగంధిః చిత్రానికి ప్రొడక్షన్‌ మేనేజరుగా పని చేశాడు. అదే ఊపులో జుమునాదాస్‌ నిర్మించిన స్త్రీ చిత్రానికి కెమెరామాన్‌గా పనిచేశాడు. గజన్ఫర్‌ ఆలిషా అనే ఒక నిర్మాత వద్ద సహాయ దర్శకునిగా పనిచేశాడు. అలా పన్నెండేళ్లు అజ్ఞాత వాసంలో గడిపిన ఎల్‌.వి.ప్రసాద్‌, హెచ్‌.ఎం.రెడ్డి ఆహ్వానంతో మద్రాసు చేరి ఆయనకు సహాయ దర్శకునిగా సత్యమే జయంః, తెనాలి రామకృష్ణః సినిమాలకు పనిచేస్తూ, ఆ చిత్రాల్లో వేషాలు కూడా వేశాడు. అయితే తాండ్ర సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఃకష్టజీవిః సినిమాకు దర్శకత్వం వహించేందుకు ప్రసాద్‌ను బొంబాయికి తీసుకెళ్లారు. మూడు రీళ్ల ముచ్చటతో ఆగిపోయిన ఆ చిత్రం తర్వాత గీతాంజలి పిక్చర్స్‌ నిర్మించిన సవాల్‌ అనే హిందీ సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేశాడు ప్రసాద్‌. అదే పరంపరలో వల్లిసాహెబ్‌ నిర్మించిన లేడి డాక్టర్‌ సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేశాడు. అలా డర్బాన్‌, నేక్‌ పర్వీన్‌ః సినిమాలకు సహాయ దర్శకునిగా దేవర్‌ చిత్రానికి స్క్రిప్టు రైటర్‌గా వ్యవహరించాడు.
గృహప్రవేశంతో స్థిరపడిన దర్శకుడు
1945లో సారథి ఫిలిమ్స్‌వారు నిర్మించిన ఃగృహప్రవేశంః చిత్రానికి దర్శకత్వం వహించేందుకు మద్రాసు వచ్చి దర్శకుడిగా స్థిరపడ్డారు. ఈ చిత్రంలో హీరోగా కూడా ప్రసాద్‌ నటించాడు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడంతో ప్రసాద్‌కు దర్శకుడిగా, నటుడిగా మంచి పేరు వచ్చింది. 1945 సంవత్సరం ప్రసాద్‌ జీవితంలో ఒక మరచిపోలేని ఏడాదిగా మిగిలింది. గృహ ప్రవేశం తర్వాత, కె.ఎస్‌.ప్రకాశరావు ద్రోహి చిత్రంలో ప్రసాద్‌ కి ఒక ముఖ్యమైన పాత్రను ఇచ్చాడు. ఈ సమయంలో రామబ్రహ్మం అనారోగ్య కారణాలతో పల్నాట్టి యుద్ధం చిత్రాన్ని పూర్తి చేయడంలో ఏర్పడిన ఇబ్బందితో ప్రసాద్‌కు దర్శకత్వ భాద్యతలు ఇచ్చాడు. 1949లో ప్రసాద్‌ ఃమనదేశంః చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం దక్కింది. ఈ చిత్రం ద్వారా ఎన్‌.టి.రామారావును నటుడుగా పరిచయం చేసాడు. 1950లో విజయ పిక్చర్స్‌ మొదటి చిత్రం షావుకారు విడుదలై ఎల్‌.వి.ప్రసాద్‌ను గొప్ప దర్శకుడిగా నిలబెట్టింది. ఎన్‌.టి.రామారావు షావుకారు సినిమాలో హీరోగా, జానకి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని షావుకారు జానకిగా పేరు తెచ్చుకున్నారు. అదే ఏడాదిలో విడుదలైన సంసారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలను సోదరులుగా ఎన్‌.టి.రామారావు, ఎ.నాగేశ్వరరావు లను ఒకచోట చేర్చింది. ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా రికార్డులు సృష్టించింది. ప్రసాద్‌ పెళ్లి చేసి చూడు, పరదేశి, మిస్సమ్మ, మనోహర, మంగయార్‌ తిలగం, భాగ్యవతిఃః వంటి అనేక చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తైళ్ల పిల్లై, ఇరువరుళం చిత్రాలకు ప్రసాద్‌ దర్శకత్వం వహించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు. అతను యాభైలలో మరికొన్ని మరపు రాని చిత్రాలకు దర్శకత్వం వహించాడు, అవన్నీ వారి నాటకం మరియు చక్కటి హాస్యానికి ప్రసిద్ధి చెందాయి. రాణి హిందీ చిత్రం అతన్ని మళ్లీ బొంబాయికి తీసుకువెళ్లింది. ఆ తర్వాత శివాజీ గణేశన్‌ నటించిన జూపిటర్‌ ఫిల్మ్స్‌ తెలుగు, హిందీ, తమిళం మాగమ్‌ ఓపస్‌  చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా శివాజీ గణేశన్‌ని స్టార్‌డమ్‌లో అత్యంత ఉన్నత స్థాయికి చేర్చింది. ఇదే సమయంలో 1955 ప్రాంతాల్లో సంసారం చిత్రాన్ని నిర్మించిన రంగనాథదాస్‌ మద్రాసులో ఒక సినిమా స్టూడియో కడదామని మొదలుపెట్టి, ఆర్ధిక ఇబ్బందులతో ఆ నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు. దాన్ని ఎల్‌.వి.ప్రసాద్‌ చేపట్టి ఃప్రసాద్‌ స్టూడియోః ని నెలకొల్పాడు. స్టూడియోను నిర్మించడంతో పాటు సినిమాలకు దర్శకత్వం వహించడం వంటి పనుల ఒత్తిడి అతని ఆరోగ్యంపై పడి ఃసయాటికాః వ్యాధి బారిన పడ్డాడు. ఆ తర్వాత వ్యాదిధి నుండి కోలుకున్నప్పటికీ, విశ్రాంతి తీసుకోవాలనే వైద్యుని సలహాను విస్మరించి వెంటనే ప్రసాద్‌ తన విధులకు హాజరయ్యాడు. దీంతో ఈ వ్యాధి మళ్ళీ రావడం కారణంగా సుదీర్ఘ చికిత్స తోపాటు ఆహార నియంత్రణలకు దారి తీసింది. ఆ తర్వాత ప్రసాద్‌ 1955లో లక్ష్మీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తెలుగులో తన మొదటి ప్రొడక్షన్‌ ఇలవేల్పుః చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను డి.యోగానంద్‌కు అప్పగించాడు. ఈ చిత్రం అనంతరం ప్రసాద్‌ 1956లో ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ః ను స్థాపించాడు. ఎల్‌.వి.ప్రసాద్‌ హిందీలో నిర్మించిన మొదటి చిత్రం శారద తర్వాత వరుస హిందీ చిత్రాలను నిర్మించారు. మిలన్‌, ఖిలోనా, ససురాల్‌, ఏక్‌ దూజే కె లియేఃః వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి ఎంతో పాపులారిటీ సంపాదించారు.
పారిశ్రామికవేత్తగా
ఎల్‌.వి.ప్రసాద్‌ సినిమాల ద్వారా సంపాదించినదంతా తిరిగి సినిమా అభివృద్ధికి దోహదపడాలని కోరుకున్నాడు. కీర్తికి తన సుదీర్ఘమైన కష్టతరమైన మార్గంలో, ప్రతి పదేళ్లకు తన వృత్తి జీవితంలో మంచి మార్పు సంభవిస్తుందని అతను కనుగొన్నాడు. మొదటి పదేండ్లు విజయవంతమైన దర్శకుడిగా ఎదగడానికి కష్టపడ్డాడు. తరువాతి పదేళ్లలో అతను విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. తరువాతి దశాబ్దం పూర్తికాక ముందే అతను సంసారం అనే చిరస్మరణీయ సాంఘిక చిత్రాన్ని నిర్మించిన రాజ్యం పిక్చర్స్‌కు చెందిన రంగనాధదాస్‌ నుండి స్వీకరించిన స్టూడియోకి గర్వించదగిన యజమాని అయ్యాడు. 1965లో తన అల్లుడు ఆర్‌.వి.ఎం.కె. ప్రసాద్‌ చురుకైన భాగస్వామ్యంతో స్టూడియోలు పూర్తిగా పనిచేశాయి. తర్వాత సంవత్సరాల్లో అతను హిందీలో గొప్ప బాక్సాఫీస్‌ హిట్‌లను నిర్మించాడు. చెన్నైలో తన చిత్రాలను మాత్రమే కాకుండా దక్షిణాదిలోని చలనచిత్ర నిర్మాతల చిత్రాలు కూడా ప్రాసెస్‌ చేయడానికి అత్యాధునిక ఫిల్మ్‌ ప్రాసెసింగ్‌ లాబొరేటరీని స్థాపించడం ద్వారా సినిమా పట్ల తన పూర్తి నిబద్దతను మరోసారి నిరూపించుకున్నాడు. ప్రసాద్‌ రెండవ కుమారుడు రమేష్‌ అమెరికాలో విద్య పూర్తి చేసుకుని వచ్చి ఆ స్టూడియో బాధ్యతలను చేపట్టాడు. 1974లో చెన్నైలో ప్రసాద్‌ ఫిల్మ్‌ ల్యాబ్స్‌ని స్థాపించాడు. ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ మిలన్‌, ఖిలోనా, ససురాల్‌, ఏక్‌ దుజే కేలియేఃః వంటి ఎన్నో బాక్సాఫీస్‌ హిట్‌ చిత్రాలను అందిం చింది. ఎల్‌.వి.ప్రసాద్‌ పారిశ్రామికవేత్తగా మారి 1956లో ఆయన ప్రారంభించిన ప్రయత్నాలే నేడు భారతదేశంలోని ఫీచర్‌ ఫిల్మ్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌కు సంబంధించిన అతిపెద్ద మౌలిక సదుపాయా లలో ఒకటిగా భారత్‌, సింగపూర్‌, దుబాయ్‌, హాలీవుడ్‌లలో సౌకర్యాలు కల్పించేందుకు కార్యాలయాలు ఏర్పాటు చేశారు. హైదరాబాదులో సైతం ప్రసాద్‌ ఫిలిం లేబొరేటరీ (ప్రాసెసింగ్‌ యూనిట్‌) స్థాపించి విదేశాలలో వున్న ఆధునిక సదుపాయాలతో సినిమా ప్రింట్లు వేయించుకునే అవకాశం కల్పించారు. 1956లోనే ఆక్స్‌బెర్రీ ఆప్టికల్‌ ప్రింటర్‌, యానిమేషన్‌ స్టాండ్‌ని దిగుమతి చేసుకున్న మొదటి వ్యక్తి ఎల్‌. వి. ప్రసాద్‌. ఫిలిం అండ్‌ టెలివిజన్‌ అకాడమీ స్థాపించారు. మొదటి కుమారుడు ఆనంద్‌ అవుట్‌డోర్‌ యూనిట్‌ ఎక్విప్‌మెంట్‌ విభాగమైన ఆనంద్‌ సినీ సర్వీసెస్‌ ప్రారంభించాడు. ఇప్పుడు ఆనంద్‌ కుమారులు రవిశంకర్‌ ప్రసాద్‌, మనోహర్‌ ప్రసాద్‌లచే ఆనంద్‌ సినీ సర్వీసెస్‌ నడుస్తుంది. ఈరోజు ప్రసాద్‌ గ్రూప్‌కు చెన్నై, హైదరాబాద్‌, ముంబై, బెంగళూరు, భువనేశ్వర్‌, తిరువనంతపురం, కోల్‌కత్తా, సింగపూర్‌, హాలీవుడ్‌లలో న్యూ ఢిల్లీ, దుబారులలో అదనపు మార్కెటింగ్‌ కార్యాలయాలున్నాయి. హుస్సేన్‌ సాగర్‌ సమీపంలో ఎన్‌.టి.ఆర్‌ మార్గ్‌లో ప్రసాద్‌ మల్టిప్లెక్స్‌ సినిమా హాలు, మాల్‌ నిర్మించాడు. సర్వేంద్రియాణాం నయనం ప్రదానంః అనే సూక్తికి అనుగుణంగా ప్రఖ్యాత నేత్ర వైద్యులు గుళ్ళపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పేదలకు కంటి వైద్యం అందించేందుకు నిర్ణయించి 1987లో బజారాహిల్స్‌లో ఎల్‌.వి. ప్రసాద్‌ కంటి ఆసుపత్రిః ని నెలకొల్పాడు. ఇది నేడు ప్రపంచంలోనే అగ్రగామి నేత్ర పరిశోధనా సంస్థలలో ఒకటిగా వెలుగొందుతోంది.
ఎల్‌.వి. ప్రసాద్‌ చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం శక్తివంతంగా, పటిష్టంగా మార్చడానికి మార్గం సుగమం చేసిన గొప్ప వ్యక్తి. సినీ ప్రపంచంలోకి నిశ్శబ్ద కాలంలో మొదలైన ఆయన ప్రయాణం దర్శకుడు, నిర్మాత, నటుడు, వ్యాపారవేత్తగా సాగి భారతీయ సినిమా మార్గదర్శకు లలో ఒకరిగా నిలిచారు. సినిమా పరిశ్రమ మరింత శక్తివంతంగా ఎదగాలని ఆశించిన ప్రసాద్‌ అనారోగ్యంతో 1994, జూన్‌ 24 న కన్ను మూశారు.
పురస్కారాలు
ఎల్‌.వి.ప్రసాద్‌ తన జీవిత కాలంలో అనేక పదవులు నిర్వహించి ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. 1980 లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తొలిసారి ఎల్‌వి ప్రసాద్‌ను రఘుపతి వెంకయ్య అవార్డును ఇవ్వగా, భారతీయ సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 1982లో ప్రతిష్టత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. ప్రసాద్‌ 1980లో న్యూ ఢిల్లీలో జరిగిన 27వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించాడు. 1981 జనవరి 3 నుండి 17 వరకు జరిగిన 8వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కోసం ఆల్‌ ఇండియా సెలక్షన్‌ ప్యానెల్‌ ఆఫ్‌ ఇండియన్‌ పనోరమా విభాగానికి ఛైర్మన్‌గా, నవంబర్‌ 1981లో మద్రాసులో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవానికి ఛైర్మన్‌గా పని చేశారు. 1982-83 ఏడాదికి సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అక్టోబర్‌ 1980 నుండి ఫిబ్రవరి 1987 వరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సెన్సార్‌లో సభ్యుడుగా, స్టూడియో ఓనర్స్‌, కౌన్సిల్‌, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వింగ్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. భారత ప్రభుత్వం 2006లో సెప్టెంబరు 5న ఎల్‌.వి.ప్రసాద్‌ జ్ఞాపకార్థం భారత తపాలా శాఖ ఆయన స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
జాతీయ చలనచిత్ర అవార్డులు
1956లో మంగయార్‌ తిలకంః తమిళ చిత్రానికి ఉత్తమ చలనచిత్రంగా మెరిట్‌ సర్టిఫికేట్‌ దక్కింది.
1962 లో భార్యభర్తలు తెలుగు చిత్రానికి ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం వచ్చింది.
ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు
1970 లో ఖిలోనా చిత్రానికి ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు రాగా, 1992 లో ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ఎల్‌వి ప్రసాద్‌ను వరించింది.
ఇతర అవార్డులు
1978-79 ఏడాదికి గాను రాజా శాండో మెమోరియల్‌ అవార్డును అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. జి. రామచంద్రన్‌ చేతుల మీదుగా అందుకున్నాడు.
1980లో భారత ఉపరాష్ట్రపతి ఎం. హిదయతుల్లాచే ఉద్యోగ్‌ పాత్ర అవార్డు అందుకున్నాడు.
1982లో సినీ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియాచే రామ్‌నాథ్‌ అవార్డు
1983లో హైదరాబాద్‌లో సితార తెలుగు సినిమా వారపత్రిక కళాతపస్వి అవార్డును అంద చేసింది.
1985లో ఆంధ్రా యూనివర్శిటీ కళా ప్రపూర్ణ అవార్డును ప్రదానం చేశారు.
1987లో ఆంధ్ర ప్రదేశ్‌ కళావేదిక హైదరాబాద్‌లో ఎల్‌వి ప్రసాద్‌కి ఆంధ్రరత్న అవార్డును ప్రదానం చేసింది.
(జనవరి 17 న ఎల్‌.వి.ప్రసాద్‌
జయంతి సందర్భంగా..)

-పొన్నం రవిచంద్ర, 9440077499

Spread the love