భారత్‌కు ఎదురుందా?

–  ఆస్ట్రేలియాతో రెండో టెస్టు నేటి నుంచి
–  2-0 ఆధిక్యంపై రోహిత్‌సేన గురి
– ఢిల్లీలో మరో స్పిన్‌ ట్రాక్‌ సిద్ధం
– ఉదయం 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సమరం ఫిరోజ్‌ షా కోట్లకు చేరుకుంది. జామ్తాలో జాతర చేసిన టీమ్‌ ఇండియా.. ఇప్పుడు కోట్లలో సిరీస్‌పై తిరుగులేని పట్టు సాధించటంపై కన్నేసింది. స్పిన్‌ మంత్రతో కంగారూలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న రోహిత్‌సేన.. న్యూఢిల్లీలోనూ ఆస్ట్రేలియాకు స్పిన్‌ ట్రాక్‌తో స్వాగతం పలుకుతోంది. టీమ్‌ ఇండియా టెస్టు యోధుడు చతేశ్వర్‌ పుజార కెరీర్‌ వందో టెస్టుకు రంగం సిద్ధం చేసుకున్న వేళ.. భారత్‌, ఆస్ట్రేలియా రెండో టెస్టు పోరు నేటి నుంచి ఆరంభం.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
టాప్‌ నిలబడేనా?!
టెస్టుల్లో భారత్‌ జోరు సాగుతున్నా.. పరిష్కారం లభించాల్సిన సమస్యలు లేకపోలేదు. ప్రధానంగా టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం భారత్‌కు నిత్యకృత్యమైంది. నాగ్‌పూర్‌ టెస్టులో రోహిత్‌ శర్మ మినహాయిస్తే.. మరో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ రాణించలేదు. కెఎల్‌ రాహుల్‌, చతేశ్వర్‌ పుజార, విరాట్‌ కోహ్లి నిరాశపరిచారు. టెయిలెండర్లు, ఆల్‌రౌండర్ల అండతో భారత్‌ బయటపడింది. తోక సాయం దక్కకుంటే నాగ్‌పూర్‌లో పరిస్థితి భిన్నంగా మారేది. స్పిన్‌ పిచ్‌లపై టాప్‌ ఆర్డర్‌ నిలిచి పరుగులు చేయకుంటే అది భారత్‌ రివర్స్‌ పంచ్‌ అవుతుంది. కెఎల్‌ రాహుల్‌ 46 టెస్టులు ఆడినా సగటు 34 దాటలేదు. బెంచ్‌పై ప్రతిభావంతుడైన యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. పరుగుల వేట సాగించకుండా రాహుల్‌ ఎంతోకాలం తుది జట్టులో నిలువలేడు. ఇక గత రెండేండ్లుగా టెస్టుల్లో అదరగొడుతున్న శ్రేయస్‌ అయ్యర్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే నేరుగా తుది జట్టులోకి రానున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. శుభ్‌మన్‌ గిల్‌, కెఎల్‌ రాహుల్‌ ఇద్దరూ తుది జట్టులో ఉండాల్సిన పరిస్థితి తలెత్తితే.. తెలుగు క్రికెటర్‌ కె.ఎస్‌ భరత్‌పై వేటు పడొచ్చు. మహ్మద్‌ సిరాజ్‌, మహ్మద్‌ షమి పేస్‌ బాధ్యతలు చూసుకోనుండా.. స్పిన్‌ త్రయం అశ్విన్‌, జడేజా, అక్షర్‌లు అటు బ్యాట్‌తో, ఇటు బంతితో మాయజాలానికి సిద్ధమవుతున్నారు.
పుంజుకుంటారా?!
బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి ఆస్ట్రేలియా మానసికంగా ఓటమికి సిద్ధపడే వచ్చింది. ఆ జట్టు శిబిరంలో ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అరంగేట్ర స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ మాయ తప్పితే.. నాగ్‌పూర్‌ టెస్టులో ఆస్ట్రేలియాకు ఊరటనిచ్చే అంశం ఒక్కటీ లేదు. టాప్‌ ఆర్డర్‌లో డెవిడ్‌ వార్నర్‌ వైఫల్యం ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కెరీర్‌ వందో టెస్టులో ద్వి శతకం బాది ఊపందుకున్న డెవిడ్‌ వార్నర్‌ విఫలమవుతున్నాడు. ఉస్మాన్‌ ఖవాజ రెండు ఇన్నింగ్స్‌ల్లో ప్రభావం చూపలేకపోయాడు. మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌లు భారత బౌలర్లను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ జోడీ నేడు కోట్లలో భారత్‌కు సవాల్‌ విసిరే ప్రమాదం కనిపిస్తోంది. ఫిట్‌నెస్‌ సాధిస్తే కామెరూన్‌ గ్రీన్‌ సైతం తుది జట్టులో నిలిచే వీలుంది. మాట్‌ రెన్షా, పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, అలెక్స్‌ కేరీలు జట్టులో తమ ఉనికి నిలుపుకోవాల్సిన అవసరం ఏర్పడింది. స్పిన్నర్లు టాడ్‌ మర్ఫీ, నాథన్‌ లయాన్‌లపై వికెట్ల బాధ్యత ఉంది. కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌కు తోడుగా పేస్‌ బాధ్యతలు ఎవరు పంచుకుంటారనేది ఆసక్తికరం. స్పిన్‌ ట్రాక్‌పై రివర్స్‌ స్వింగ్‌తో భారత్‌ను దెబ్బకొట్టేందుకు ఆస్ట్రేలియా సరికొత్త ప్రణాళిక రచిస్తోందని అనిపిస్తుంది.
పిచ్‌, వాతావరణం
ఫిరోజ్‌ షా కోట్ల మైదానం సైతం జామ్తా పిచ్‌ తరహాలోనే ఉండనుంది. తొలి రోజు పిచ్‌పై తేమ ఉండనుంది. కానీ ఆ తర్వాత పిచ్‌ జీవం లేకుండా తయారవుతుంది. స్పిన్‌ స్వర్గధామ పిచ్‌పై ఐదు రోజులు ఆడితే అద్భుతమే అని చెప్పాలి. టాస్‌ నెగ్గిన తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గు చూపనుంది. టెస్టు మ్యాచ్‌కు పెద్దగా వర్షం సూచనలు కనిపించటం లేవు. ఇక్కడ తొలి టెస్టు 1948లో జరుగగా, చివరి టెస్టు 2017లో జరిగింది. 1993 నుంచి కోట్లలో భారత్‌కు ఓటమి లేదు. 1959 టెస్టులో ఆస్ట్రేలియా ఇక్కడ ఇన్నింగ్స్‌ 127 పరుగులతో గెలుపొందింది. 2008 భారత్‌, ఆసీస్‌ టెస్టు డ్రాగా ముగిసింది.
తుది జట్లు (అంచనా)
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కెఎల్‌ రాహుల్‌, చతేశ్వర్‌ పుజార, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా, రవిచంద్ర అశ్విన్‌, కె.ఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌.
ఆస్ట్రేలియా : డెవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజ, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాట్‌ రెన్షా, పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, అలెక్స్‌ కేరీ (వికెట్‌ కీపర్‌), పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), టాడ్‌ మర్ఫీ, నాథన్‌ లయాన్‌, మిచెల్‌ స్టార్క్‌/కామెరూన్‌ గ్రీన్‌.

Spread the love