భారత్‌లో డెన్మార్క్‌ యువరాజు పర్యటన

న్యూఢిల్లీ : డెన్మార్క్‌ యువరాజు ఫ్రెడెరిక్‌ ఆండ్రే హెన్రిక్‌ క్రిస్టియన్‌, యువరాణి మేరీ ఎలిజబెత్‌ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. మార్చి 2 వరకు వారు భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటన డెన్మార్క్‌-భారత్‌కు మధ్య స్నేహబంధం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి డెన్మార్క్‌ రాచకుటుంబం భారత్‌లో పర్యటిస్తోందని పేర్కొన్నారు. దీనిలో యువరాజు వెంట ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి లార్స్‌ లోకీ రస్‌ముస్సేన్‌, పర్యావరణ శాఖ మంత్రి మాగస్‌ హ్యూనిక్‌, ఇంధన శాఖ మంత్రి లార్స్‌ అగార్డ్‌ కూడా ఉన్నారు. ‘ఈ పర్యటనలో వీరు తొలుత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్‌తో భేటీ కానున్నారు. ఆ తర్వాత కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ నిర్వహించే ‘ఇండియా-డెన్మార్క్‌: పార్టనర్స్‌ ఫర్‌ గ్రీన్‌ అండ్‌ సస్టైనబుల్‌ ప్రోగెస్‌’ కార్యక్రమం ప్రారంభ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ సమావేశమవుతారు. ఆగ్రా, చెన్నైలో పర్యటించి.. మార్చి 2న తిరిగి డెన్మార్క్‌ బయలుదేరుతారు’ అని విదేశాంగశాఖ అధికారులు తెలిపారు.

Spread the love