భారత్‌, న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌ 13 నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు

– హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజహరుద్దీన్‌ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
‘గతంలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భారత్‌, న్యూజిలాండ్‌ వన్డేకు మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఆన్‌లైన్‌ పద్దతిలోనే పూర్తి టికెట్లు అమ్మకానికి ఉంచుతాం. బ్లాక్‌మార్కెట్‌లోకి టికెట్లు వెళ్లకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉన్నాయనే విషయం అందరికీ తెలిసే విధంగా ప్రచారం చేస్తామని’ హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ అన్నారు. జనవరి 18న హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో భారత్‌, న్యూజిలాండ్‌ తొలి వన్డేలో తలపడనున్నాయి. వన్డే మ్యాచ్‌కు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌, మాజీ కార్యదర్శి ఆర్‌. విజయానంద్‌, సుప్రీంకోర్టు నియమిత పర్యవేక్షణ కమిటీ సభ్యుడు వంక ప్రతాప్‌లు వెల్లడించారు. రాచకొండ పోలీసు కమిషనర్‌ దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌, క్రీడాశాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాలను కలిసిన అజహరుద్దీన్‌, విజయానంద్‌, వంక ప్రతాప్‌లు వన్డే మ్యాచ్‌ను సజావుగా నిర్వహించేందుకు సహాయ, సహకారం అందించాలని కోరారు.
జనవరి 13 నుంచి టికెట్లు : భారత్‌, న్యూజిలాండ్‌ తొలి వన్డే టికెట్లను జనవరి 13 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. జనవరి 13 నుంచి 16 వరకు నాలుగు విడతలుగా టికెట్లను పేటీఎం వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌లో అందుబాటులోకి తేనున్నారు. జనవరి 13న సాయంత్రం 5 గంటలకు తొలి విడతగా 6 వేల టికెట్లు, జనవరి 14న సాయంత్రం 5 గంటలకు రెండో విడతగా 7 వేల టికెట్లు, జనవరి 15న సాయంత్రం 5 గంటలకు మూడో విడతగా 7 వేల టికెట్లు సహా జనవరి 16న సాయంత్రం 5 గంటలకు నాల్గో విడతగా మిగిలిన మొత్తం టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచనున్నారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్లకు సంబంధించిన వివరాలు, ప్రభుత్వ గుర్తింపు కార్డుతో ఎల్బీ స్టేడియం, గచ్చిబౌలి స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో ఫిజికల్‌ టికెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ కౌంటర్ల వద్దకు ప్రవేశం కల్పించనున్నారు. ఆన్‌లైన్‌లో ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు టికెట్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉంది.
కాంప్లిమెంటరీ టికెట్లు 9695 : ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం సీటింగ్‌ సామర్థ్యం 39112. ఇందులో నుంచి కాంప్లిమెంటరీ (ఉచితం) పాసుల రూపంలో 9695 టికెట్లు ఇవ్వనున్నారు. ఇవి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండవు. హెచ్‌సీఏ స్వయంగా అందిస్తుంది. మిగిలిన 29417 టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టనున్నారు. సెప్టెంబర్‌లో భారత్‌, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌ అనుభవాల దృష్ట్యా ఈ వన్డే మ్యాచ్‌కు ఆఫ్‌లైన్‌ పద్దతిలో టికెట్లను అమ్మటం లేదు. హెచ్‌సీఏ క్లబ్‌ కార్యదర్శులు సైతం గరిష్టంగా 10 టికెట్లను మాత్రమే కొనుగోలు చేసేలా పరిమితి విధించారు.
టికెట్‌ ధర రూ.850 నుంచి : భారత్‌, న్యూజిలాండ్‌ తొలి వన్డే మ్యాచ్‌కు పలు విభాగాలుగా ధరలను నిర్ణయించారు. పెవిలియన్‌ టెర్రస్‌ టికెట్ల ధరలను రూ.850, రూ.1000, రూ.1250గా నిర్ణయించారు. ఫస్ట్‌ ఫ్లోర్‌, సెకండ్‌ ఫ్లోర్‌ టికెట్‌ ధరలను రూ.2500, రూ.5000, రూ.7500, రూ.9000, రూ.10000లుగా సీటింగ్‌ పొజిషన్‌ ఆధారంగా తేల్చారు. ఇక కార్పోరేట్‌ బాక్సుల టికెట్‌ ధరలు రూ. 17,700, రూ.20,650గా నిర్ణయించారు.
14న రానున్న కివీస్‌ ఆటగాళ్లు : హైదరాబాద్‌లో జనవరి 18న జరుగనున్న తొలి వన్డే కోసం న్యూజిలాండ్‌ జట్టు ఈ నెల 14న హైదరాబాద్‌కు చేరుకోనుంది. 15 సాయంత్రం నుంచి కివీస్‌ క్రికెటర్లు ప్రాక్టీస్‌ సెషన్‌లో సాధన చేయనున్నారు. జనవరి 16న భారత జట్టు గువహటి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రానుంది. 17న న్యూజిలాండ్‌ మధ్యాహ్నాం సెషన్లో ప్రాక్టీస్‌ చేయనుండగా,. భారత జట్టు అదే రోజు సాయంత్రం సెషన్లో సాధన చేయనుంది. ఈ మేరకు ఇరు జట్ల బస, సాధనకు హెచ్‌సీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Spread the love