భారత్‌ స్వశక్తితో ఎదుగుతున్న దేశం

–  టీయూలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌
నవతెలంగాణ-డిచ్‌పల్లి
‘భారత్‌.. అత్యంత వేగవంతంగా అభ్యున్నతి చెందుతున్న దేశం. స్వయం శక్తితో ఎదుగుతున్నది. 20 దేశాలకు నాయకత్వం వహిస్తున్న సందర్భంలో గర్వంగా ఉంది. మప కలను సాకారం చేసుకొనే దిశగా పయణించాలి’ అని రాష్ట్ర గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో శనివారం ”ఇండియాస్‌’ జి 20 ప్రెసిడెన్సీ: ఆపర్చునిటీస్‌ అండ్‌ ఛాలెంజెస్‌ ఫర్‌ ఇండియా యాస్‌ ది గ్లోబల్‌ లీడర్‌” అంశంపై నిర్వహించిన సదస్సులో గవర్నర్‌ పాల్గొన్నారు మొదట ఉపకులపతి ఆచార్య డి.రవీందర్‌ గవర్నర్‌కు స్వాగతం పలికారు. 7వ బెటాలియన్‌ పోలీస్‌ సిబ్బంది ‘గాడ్‌ ఆఫ్‌ ఆనర్‌’ (గౌరవ వందనం) చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక్‌ మహాసంఫ్‌ు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సును జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగించారు. భారతదేశం జీ-20 దేశాల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గ్రూప్‌ ఆఫ్‌ నేషన్స్‌, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)- న్యూఢిల్లీ, దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలను విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించిందన్నారు. ఇప్పుడు భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు. 85 శాతం అంతర్జాతీయ స్టార్టప్‌ కంపెనీలు మన దేశ సహకారం కోసం ఎదురుచూ స్తున్నాయని చెప్పారు. కరోనా మహమ్మారిని తట్టుకొనే వాక్సినేషన్‌ను తయారుచేసి దాదాపు 150 దేశాలకు సరఫరా చేసిన ఘనత మన దేశానికి ఉందన్నారు. ఇదేగాక రుబెల్లా, పోలియో వ్యాధులకు వాక్సిన్‌ తయారు చేసి అతి ప్రాణాంతమైన వ్యాధులకు చికిత్స అందిస్తుందన్నారు. భారతదేశం సర్వ స్వతంత్ర దేశంగా ఎదుగుతుందన్నారు. భారతదేశ చరిత్ర అజరామరం అయిందన్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటం ప్రపంచ దేశాలకు శాంతి, అహింస మార్గాలను చూపిందన్నారు. ఈ 2023వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ”ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ మిల్లెట్స్‌” అనే సంక్షిప్త సందేశంతో ముందుకు వెళ్తుందని చెప్పారు. సంపూర్ణ చిరుధాన్యాల ఆహారం మన భారతీయుల సంస్కృతి అన్నారు. భవిష్యత్తు తరాలకు పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపుపై అవగాహన పెంచాలని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలను విద్యార్థులు చదివి స్ఫూర్తి పొందాలని సూచించారు. యువత ఏదైనా సాధించగలదని, అసాధారణ ప్రతిభ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, ఎబిఆర్‌ఎస్‌ఎం జాతీయ సంయుక్త కార్యనిర్వహణ కార్యదర్శి గుంత లక్ష్మణ్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య బి.విద్యావర్ధిని, ప్రిన్సిపాల్‌ ఆచార్య సిహెచ్‌. ఆరతి, వీసీ సతీమణి సౌభాగ్యలక్ష్మి, సదస్సు డైరెక్టర్‌ డా.సత్యనారాయణ పాల్గొన్నారు.

Spread the love