– వీధికుక్కల స్వైర విహారం
– పిల్లల రక్తం చూస్తున్న శునకాలు
– హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఘటనలు
– తీవ్రంగా గాయపడుతున్న బాలలు
నవతెలంగాణ-ఎల్బీనగర్ / బోడుప్పల్/ రాజేంద్రనగర్
వీధి కుక్కల దాడులు ఎక్కువవయ్యాయి. మూడ్రోజుల కిందట హైదరాబాద్ అంబర్‌పేటలో బాలునిపై దాడి చేసి లాక్కెళ్లిన దారుణ ఘటన కండ్ల ముందు కదలాడుతుండగానే.. బుధవారం మూడు జిల్లాల్లో పిల్లలు, వృద్ధురాలిపై కుక్కలు దాడులు చేశాయి. వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ కొత్తపేట డివిజన్ మారుతినగర్‌లో ఆడుకుంటున్న పిల్లలపై నాలుగు వీధి కుక్కలు దాడి చేయగా రిషి అనే నాలుగేండ్ల బాలుడు గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అధికారులకు ఫిర్యాదు చేయగా.. బుధవారం రెండు కుక్కలను పట్టుకున్నారు. అయితే, జంతు ప్రేమికులమంటూ కొందరు వచ్చి వారికి డబ్బులు ఇవ్వడంతో ఆ రెండు కుక్కలను పక్క గల్లీలో వదిలేసి చేతులు దులుపుకున్నారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పీర్జాదీగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జటాయువు పార్కులో ఓ జింక పిల్లపై వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి జింక మృత్యువాతపడింది. అసలు వీధి కుక్కలు జటాయువు ఫారెస్ట్‌లోకి ఎలా ప్రవేశించాయని ఫారెస్ట్ అధికారులను పలువురు ప్రశ్నించారు.
ఎర్రబడాలో ఐదుగురిపై దాడి చేసిన కుక్కలు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడా ఎర్రబోడ బస్తీలో వీధి కుక్కలు బీభత్సం సృష్టించాయి. మధ్యాహ్నం బస్తీలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై ఐదు కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న నాలుగేండ్ల బాలుడిపై కూడా కుక్కలు దాడి చేశాయి. ఆ బాలుడు గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు అక్కడకు చేరుకుని కర్రలతో కుక్కలను తరిమి, బాలుడిని రక్షించారు. బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. బస్తీల్లో కుక్కల సమస్య తీవ్రంగా ఉందని జీహెచ్‌ఎంసీ వెటర్నరీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధురాలిపై దాడి
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని జాగిరిపల్లె గ్రామానికి చెందిన వృద్ధురాలు ఎల్లమ్మ ఇంటి ముందు కూర్చున్న సమయంలో వీధి కుక్క దాడి చేసింది. కాలుకు గాయం కాగా, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స చేయించారు.