మత్స్య కారులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ-అంబర్‌పేట
మత్స్యకారులకు ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. వివిధ రకాల చేపల వంటకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావడానికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. బుధవారం మాసాబ్‌ ట్యాంక్‌ లోని మత్స్యశాఖ కార్యాలయం ఆవరణలో రూ.25 లక్షలతో నూతనంగా అభివృద్ధి చేసిన ఫిష్‌ క్యాంటీన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో చేపల వినియోగాన్ని పెంచేందుకు చేపల వంటకాలపై మహిళలకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ రంగానికి తగిన ఆదరణ లేదనీ, రాష్ట్ర ఆవిర్బావం తర్వాత సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నిధులు కేటా యించినట్టు తెలిపారు. పెరిగిన మత్స్య సంపదను మత్స్యకారులు విక్రయించుకోవడానికి గాను సబ్సిడీపై వివిధ రకాల వాహనాలు అందజేసినట్టు చెప్పారు. చేపలు, చేపల వంటకాల విక్రయాల కోసం సబ్సిడీపై మొబైల్‌ రిటైల్‌ ఫిష్‌ ఔట్‌ లెట్‌లను కూడా అందజేసినట్టు వివరించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో లభించే చేప వంటకాలకు ఆదరణ పెరిగిన కారణంగా వచ్చే వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. త్వరలోనే వివిధ రకాల వంటకాలతో కూడిన ఫిష్‌, మటన్‌ స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. ప్రభుత్వ పథకాల లబ్ది అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిం చాలనే ఉద్దేశంతోనే మత్స్య సొసైటీలలో సభ్యత్వ నమోదు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ అధర్‌ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ రాంచందర్‌, మంజువాణి, శ్రీనివాస్‌, మురళీకృష్ణ, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love