మనుస్మృతి హక్కులను హరిస్తే… రాజ్యాంగం కల్పించింది

– స్వేచ్ఛ జేఏసీ సదస్సులో సీనియర్‌ జర్నలిస్టు సతీష్‌చందర్‌
– మనువాదానికి మరణ శాసనం రాయాల్సిందే : ప్రజాకవి జయరాజు
– సదస్సు అనంతరం నేతల అరెస్ట్‌
– శాంతియుతంగా సదస్సు పెట్టుకుంటే అరెస్టులా? : స్వేచ్ఛ జేఏసీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రజల స్వేచ్ఛకు నిర్బంధాలు విధించి, కులాధిపత్యంతో కులపీడన చేసిన మనుస్మృతిని మళ్లీ తీసుకురావడం శోచనీయమని సీనియర్‌ జర్నలిస్టు సతీష్‌చందర్‌ అన్నారు. అణగారిన ప్రజలను మనుస్మృతి అణిచివేసిందని, భారత రాజ్యాంగం మాత్రం వారిని అక్కున చేర్చుకుని హక్కులు కల్పించిందని తెలిపారు. స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం వర్సెస్‌ మనుస్మృతి’ అనే అంశంపై జేఏసీ కన్వీనర్‌ టి.రమేష్‌ అధ్యక్షతన ఆదివారం అంబేద్కర్‌ రిసోర్స్‌ సెంటర్‌లో నిర్వహించిన సదస్సులో సతీష్‌చందర్‌ పాల్గొని మాట్లాడారు. మనుస్మృతి వేల ఏండ్లుగా ఈ దేశ ప్రజలను వర్ణం, కులం అనే గీతలు గీసి మెజారిటీ ప్రజలను అణచివేసిందని, ముఖ్యంగా మహిళలను ఒక ప్రాణం ఉన్న మనిషిగా చూడడానికి నిరాకరించిందన్నారు.
భర్త చనిపోతే భర్తతో పాటే పాడే ఎక్కి చావాలని నిర్దేశించడంతో పాటు వారికి చదువు, ఆస్తి వద్దని, సేవ మాత్రమే చేయాలని కుతంత్రం చేసిందని విమర్శించారు. కానీ భారత రాజ్యాంగం వారికి చదువు ఇచ్చిందని, ఆస్తి అవకాశం కల్పించిందని, ఓటు హక్కు ఇచ్చిందని, రాజ్యాన్ని పాలించాలని కూడా చెప్పి ఎంతో స్వేచ్చను కల్పించిందని తెలిపారు. కానీ రాజ్యాంగం పాటిస్తామని వాగ్దానం చేసిన పాలకులే నేడు రాజ్యంగ హక్కుల పట్ల చిన్నచూపు చూపుతున్నారని విమర్శించారు. రచయిత జూపాక సుభద్ర మాట్లాడుతూ.. మనుస్మృతికి వ్యతిరేకంగా, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల రక్షణకు పోరాటం తప్పదన్నారు. ప్రజాకవి జయరాజు మాట్లాడుతూ.. అంబేద్కర్‌, మార్క్స్‌, బుద్దుడు చెప్పిన అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్లడానికే, రాజ్యాంగం హక్కుల రక్షణ కోసమే స్వేచ్ఛ జేఏసీ ఏర్పడిందన్నారు.
మనువాదానికి మరణ శాసనం రాయాలని పాటతో ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో స్వేచ్ఛ జేఏసీ కోకన్వీనర్లు కోలా జనార్దన్‌, ఝాన్సీ, ఆదాం రాజు, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు, ఏఐఎఫ్‌డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ విజరుకుమార్‌, పీడీఎస్‌యూ నాయకులు మహేష్‌, డీబీఎఫ్‌ నాయకులు శంకర్‌, నాయకులు గుత్తా జ్యోత్స్న, కృష్ణచంద్‌, రామకృష్ణలు పాల్గొన్నారు.
నేతల అరెస్టు
సైఫాబాద్‌లోని అంబేద్కర్‌ రిసోర్స్‌ సెంటర్‌లో స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం వర్సెస్‌ మనుస్మృతి’ అనే అంశంపై శాంతియుతంగా సదస్సును ముగించుకుని వెళ్తున్న స్వేచ్ఛ జేఏసీ, సామాజిక, ప్రజాసంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నేతలను నాంపల్లి, ముషీరాబాద్‌ పోలీసు స్టేషన్లకు తరలించారు. రాష్ట్రంలో శాంతియుతంగా హాల్‌ మీటింగ్‌ కూడ నిర్వహించుకోలేని పరిస్థితి ఉండటం దౌర్భాగ్యమని స్వేచ్ఛ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని తగులబెడతామంటున్న వాళ్లను పోలీసులు రక్షిస్తున్నారని, రాజ్యాంగాన్ని రక్షించాలని శాంతియుతంగా సమావేశాలు నిర్వహిస్తున్న వాళ్లను అక్రమ అరెస్టులు చేయడం శోచనీయమన్నారు.
ఇదేంతీరు : డీవైఎఫ్‌ఐ
హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ రీసోర్స్‌ సెంటర్‌లో భారత రాజ్యాంగం వర్సెస్‌ మనుస్మృతి సదస్సు ముగించుకుని తమ ఇండ్లకు వెళ్తున్న స్వేచ్ఛ జేఏసీ నాయకులను అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌ తెలిపారు. అరెస్టు చేసిన ప్రజాసంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌తో సహా పలువురు స్వేచ్ఛా జేఏసీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్‌ దగ్గరున్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద కార్యక్రమం నిర్వహిస్తారనే అనుమానంతో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, జర్నలిస్టు సతీష్‌ చందర్‌, కవి జయరాజు, జూపాక సుభద్ర, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌ బాబు, జెఏసీ కన్వీనర్‌ టి.రమేష్‌, టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ విజరు, బానాసా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదాం రాజు వంటి ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు.
అరెస్టు అప్రజాస్వామికం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ రిసోర్స్‌ సెంటర్‌లో ‘భారత రాజ్యాంగం-మనుస్మృతి సదస్సు అనంతరం ఇంటికి వెళ్తున్న సామాజిక ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం ఖండించారు.
వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నాయకులను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.
అప్రజాస్వామికచర్య : కేవీపీఎస్‌
స్వేచ్ఛ జేఏసీ నాయకులకు అక్రమంగా అరెస్టు చేశారనీ, ఇది అప్రజాస్వామక చర్య అని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌ వెస్లీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లో అంబేద్కర్‌ రిసోర్స్‌ సెంటర్‌లో ‘భారత రాజ్యాంగం-మనుస్మృతి’ అంశంపై జరిగిన సదస్సులో వారు పాల్గొన్నారనీ, సదస్సు అనంతరం ఇంటికి వెళుతున్న సామాజిక, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు.

Spread the love