మ‌రో విడ‌త రెపో రేటు పెంచిన ఆర్బీఐ

హైదరాబాద్: రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) మరో విడత రేట్ల పెంపు దిశగా అడుగులు వేసింది. రెపో రేటును 0..35 శాతం పెంచింది. దీంతో రెపో రేటు 6.25 శాతానికి చేరింది. నేడు అన్ని బ్యాంకులు రెపో రేటు ఆధారితంగానే (ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ రేటు) రుణాలను మంజూరు చేస్తున్నాయి. కనుక బ్యాంకులు ఈ మేరకు రుణాలపై రేట్లను పెంచడం ఖాయమే అని తెలుస్తోంది. ఆర్ బీఐ ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు పలు విడతలుగా మొత్తం 2.25 శాతం మేర రెపో రేటును పెంచింది. దీంతో ఈ మేరకు రుణాలపై అదనపు భారం మోపినట్టయింది.
స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 6 శాతానికి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు సైతం 0.35 శాతం పెరిగి 6.5 శాతానికి చేరాయి. ఇప్పటికీ ఆర్ బీఐ సర్దుబాటు వైఖరిని ఉపసంహరించుకునే క్రమంలోనే ఉన్నట్టు తెలిపింది. వచ్చే 12 నెలల కాలంలో ద్రవ్యోల్బణం 4 శాతానికి పైనే ఉంటుందని ఆర్ బీఐ అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ అక్టోబర్ లోనూ బలపడినట్టు ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. ట్రాక్టర్లు, ద్విచక్ర వాహన విక్రయాలు పెరగడం గ్రామీణ డిమాండ్ కోలుకుంటున్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. నవంబర్ నెలకు సంబంధించి తయారీ, సేవల రంగ పీఎంఐ గణాంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటును అంచనాను ఆర్ బీఐ ఎంపీసీ 4.4 శాతానికి పరిమితం చేసింది. వచ్చే జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధి 4.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2022-23 సంవత్సరానికి ద్రవ్యల్బోణం లక్ష్యాన్ని 6.7 శాతంగా కొనసాగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతానికి తగ్గించింది.

Spread the love