మల్లయుద్ధ పోటీలు అభినందనీయం

– కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌
హైదరాబాద్‌: మల్లయుద్ధ రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్స్‌ నిర్వాహకులను కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అభినందించారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి, జాతీయ అంతర్జాతీయ పోటీలకు సన్నద్ధమయ్యేలా ఆర్థిక సహకారం అందించటం గొప్ప విషయమని నిర్వాహకులకు పంపిన వీడియో సందేశంలో అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. ‘ ముఖేష్‌ గౌడ్‌ మంత్రిగా, నాలుగుసార్లు ఎమ్మెల్ల్యేగా ప్రజలకు సుపరిచితుడు. ఆయన మంచి రెజ్లర్‌. ముఖేష్‌ స్మారకార్థం భారీ స్థాయిలో రెజ్లింగ్‌ పోటీలను నిర్వహించటం అభినందనీయం. 17 కేటగిరీలు, రూ.30 లక్షల నగదు బహుమతి, రూ.5 లక్షల ఉపకార వేతనాలతో కూడిన టోర్నమెంట్‌ నిర్వహిస్తున్న శ్రేష్ఠ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు విక్రమ్‌ గౌడ్‌కు ప్రత్యేక అభినందనలు. మల్లయుద్ధలో అమ్మాయిలకు ప్రత్యేకంగా చాంపియన్‌షిప్‌ నిర్వహించటం ఆహ్వానించదగిన పరిణామం. ఈ స్థాయి టోర్నమెంట్‌ నిర్వహిస్తున్న విక్రమ్‌గౌడ్‌ను త్వరలోనే స్వయంగా కలిసి అభినందిస్తాను’ అని అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. ఇదిలా ఉండగా, నాలుగు రోజుల మల్లయుద్ధ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు రెండో రోజు ఉత్కంఠగా సాగాయి. తొలి రోజు పురుషుల అండర్‌-15, అండర్‌-17 విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. రెండో రోజు పురుషుల సీనియర్‌ విభాగంలో 55 కేజీలు, 60 కేజీలు, 66 కేజీల కేటగిరిల్లో పోటీలు కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 700 మంది రెజ్లర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు.

Spread the love