మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు నిధులు పెంచాలి

– దురుసుగా ప్రవర్తిస్తున్న
– సినియర్ అసిస్టెంట్ నిరెదిత పై చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ – డిచ్ పల్లి
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు నిధులు పెంచాలని, దురుసుగా ప్రవర్తిస్తున్న సినియర్ అసిస్టెంట్ నిరెదిత పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం  ప్రతినిధి బృందం సభ్యులు తెలిపారు. మంగళవారం డిచ్ పల్లి మండల ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో  సీనియర్ అసిస్టెంట్ నిరెదీత వినతి పత్రాన్ని స్వీకరించకపోవడంతో  ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేశారు. సీనియర్ అసిస్టెంట్ నిరెదిత కు అనేకసార్లు వినతి పత్రం అందజేయడానికి వచ్చిన వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇబ్బందికరంగా మాట్లాడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులు ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ  సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రపు సాయ గౌడ్  మాట్లాడుతూ, 2023-24 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఉపాధి హామీకి పథకానికి నిధులు తగ్గించి నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు చిన్న, సన్న కారు రైతులకు వ్యతిరేకంగా వ్యవహరించిందన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగటం వలన గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు సంవత్సరం పొడుగునా  పనులు లేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు.  ఒకపక్క ప్రభుత్వాలు నిత్యవసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెంచుతూ పోతుందని, గ్రామాలలో సగటున సంవత్సరంలో 90 రోజుల కంటే ఎక్కువ పని దినాలు లేక పస్తులుండాల్సిన స్థితిలో ఉపాధి హామీ చట్టం కార్మికులు ఉన్నారని తెలిపారు. కార్మికులకు పనులు లేని రోజులలో ఉపాధి కూలీలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ చట్టానికి నిధులు తగ్గించటం అత్యంత విచారకరమన్నారు. కరోనా లాంటి విపత్తు సమయాలలో వలస కూలీలకు ఉపాధి కల్పించిన ఈ చట్టానికి నిధులు తగ్గించటం అంటే పేద ప్రజలకు అన్యాయం చేయటమేనన్నారు. 2021 సంవత్సరంలో లక్ష పదివేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం. 2023 లో 60 వేల కోట్లను కేటాయించడం అంటే ఉపాధి కూలీల పొట్ట కొట్టడమే అన్నారు. బడా పెట్టుబడిదారులైన ఆదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీ ల యజమానులకు 69 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయించిన ప్రభుత్వం అందులో 10% కూడా ఉపాధి  కూలి పని దినాలకు కేటాయించకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేద ప్రజల కడగండ్లను  దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్లో కేటాయించిన నిధులను గత సంవత్సరం కేటాయించిన నిధుల కంటే రెండింతలు  సర్దుబాటు చేయాలని ఆయన కోరారు. జాబు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, 600 రూపాయల రోజు వేతనం ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు వాసరి మోహన్, రాజేందర్, నాయకులు రాందాస్, సాగర్, సాయిలు, మురళి తదితరులు పాల్గొన్నారు.

Spread the love