మహావీర్‌ పరిశ్రమను మూసేయాలని ధర్నా

– ప్రాణాలతో చెలగాటమాడుతోందని గుండేడు గ్రామస్తుల ఆవేదన
– లేదంటే మాకెక్కడన్నా ఇండ్లు ఇవ్వండని ఆగ్రహం
నవ తెలంగాణ- బాలానగర్‌
పది సంవత్సరాల నుంచి తీవ్రమైన వాయు కాలుష్యం వదులుతున్న మహావీర్‌ పరిశ్రమను మూసివేయాలని గుండేడు గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా చేశారు. అంతకుముందు పరిశ్రమ గేటు వద్ద నుంచి ర్యాలీగా వచ్చారు. తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు కూడా ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. మహావీర్‌ పరిశ్రమ నుంచి వచ్చే వాయు కాలుష్యం పంట పొలాలు, పూల తోటలు, నేలపైన తీవ్రమైన దుమ్ము ధూళి పేరుకుపోతోందన్నారు. దీంతో పంటలకు నష్టం జరుగుతోందన్నారు. పరిశ్రమను మూసేయాలని పలుమార్లు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి మొక్కుబడిగా తనిఖీలు చేసి వెళ్లారని ఆరోపించారు. తీవ్రమైన కాలుష్యం వల్ల వ్యాధుల బారిన పడుతున్నామన్నారు. పరిశ్రమ గేటు ముందు ధర్నా చేసినా కనీసం పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూములు.. ఇండ్లు కొంటారా.. మరో చోట మాకు ఇండ్లు కట్టించి ఇవ్వండి లేదంటే పరిశ్రమను మూసేయండి అని డిమాండ్‌ చేశారు. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

Spread the love