మహిళా వర్సిటీ ఇన్‌చార్జీ వీసీగా విజ్జులత

–  ప్రభుత్వ నియామకం
–  ఉన్నత విద్యలో స్త్రీలు ముందుండాలి : మంత్రి సబిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం మొదటి ఇన్‌చార్జీ ఉపకులపతి (వీసీ)గా ప్రొఫెసర్‌ ఎం విజ్జులతను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆమెకు విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ వీసీ డి రవీందర్‌ శనివారం మంత్రి నివాసంలో కలిసి అభినందించారు. ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండేలా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఇన్‌చార్జి వీసీగా ఎం విజ్జులత నియామకం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అంతరా ్జతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని నూతన వీసీకి సూచించారు. ఈ విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లు కేటాయించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్సిటీ అవసరాలు, ఇతర పరిస్థితులకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ లింబాద్రికి సూచించారు. బోధనా సౌకర్యాలు, విద్యార్థినులకు కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచాలని కోరారు. వీసీగా నియమించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి విజ్జులత కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక వసతులను మెరుగుపర్చి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కోఠి మహిళా కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా గతేడాది ఏప్రిల్‌ 25న ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీసీని నియమించకపోవడం గమనార్హం.

Spread the love