మాకు చెప్పకుండా నిర్ణయం వద్దు

– కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై హైకోర్టు
నవతెలంగాణ – హైదరాబాద్‌
కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ను రైతులు వ్యతిరేకిస్తున్నట్టు అభిప్రాయాలు వెల్లడయ్యాక కూడా దాన్ని ఎందుకు రద్దు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందనీ తాత్కాలికంగా అమలు చేయడం లేదని ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. మాస్టర్‌ ప్లాన్‌ అమలు విషయంలో కోర్టుకు సమాచారం ఇవ్వకుండా ముందుకు వెళ్లరాదని ఆదేశించింది. ఒకేవేళ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయాలని భావిస్తే తమ అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్‌ 17వ తేదీలోగా పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులను సంప్రదించకుండా కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ రూపొందించడం చట్టవిరుద్ధమని వెల్లడించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఇదే సమయంలో ఆయన సచివాలయ అంశాన్ని ప్రస్తావన చేయబోగా హైకోర్టు నిరాకరించింది.

Spread the love