మాణిక్‌రెడ్డిని భారీ మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించాలి

–  టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి
నవతెలంగాణ-మంచాల
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఎస్‌యూటీఎఫ్‌ బలపరిచిన అభ్యర్థి మాణిక్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సంఘం రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి ఉపాధ్యాయులను కోరారు. గురువారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలు, కేజీబీవీ పాఠశాలల్లో మాణిక్‌రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగార్థులను పర్మినెంట్‌ చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఎస్‌ యూటీఎఫ్‌ ఎంతో కృషి చేస్తోందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం తమ సంఘంతోనే సాధ్యమని చెప్పారు. ఉపాధ్యాయులకు నిరంతరం అందుబాటులో ఉండే మాణిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు సుగంధ, జిల్లా ఉపాధ్యక్షులు కల్పన, జిల్లా కార్యదర్శులు భువనేశ్వరి, రాములయ్య, కేజీబీవీ ఎస్‌ఓ శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.

Spread the love