మాతా శిశుసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

– మంత్రి సత్యవతి రాథోడ్‌
నవతెలంగాణ-ములుగు
మాతా శిశుసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో బుధవారం ప్రారంభమైన కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కిట్‌ పోస్టర్‌ ఆవిష్కరించి, పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మెన్‌ కుసుమ జగదీష్‌, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ అంకిత్‌తో కలిసి మంత్రి ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గర్భిణీలు మొదలుకొని బాలింత వరకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో గిరి పోషణ కింద ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ పథకాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కోరినట్టు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో హెల్త్‌ ప్రొఫైల్‌ పూర్తి చేసి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్‌ కార్డు ప్రచురించామన్నారు. జిల్లాలో గిరిజన మారుమూల లంబాడా, కోయగూడాల్లో సంక్షేమ అభివృద్ధి పథకాలు పేదవాళ్లకు పారదర్శకంగా అందిస్తున్నామని అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయ సముదాయ కలెక్టరేట్‌ భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి సీఎం ్వరలో జిల్లాకు రానున్నారని తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ, పీఆర్‌ రోడ్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు అందాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మినీ మేడారం జాతర ప్రారంభం కానుందని, అభివృద్ధి పనులకు కలెక్టర్‌ రూ.2కోట్లు మంజూరు చేయాలని కోరారని, జనవరి మొదటి వారంలో జాతర నిర్వహణపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 28న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రాక సందర్భంగా రామప్ప, పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) వైవీ గణేష్‌, డీఆర్‌ఓ కే రమాదేవి, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జగదీశ్వర్‌, కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ జిల్లా ఇన్‌చార్జి రాజేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love