మార్క్సిజానికి కార్మిక వర్గం దగ్గరయ్యే పరిస్థితులు పెరుగుతున్నాయని సుందరయ్య విజ్ఞానకేంద్రం మాజీ కార్యదర్శి సీ సాంబిరెడ్డి అన్నారు. గడచిన 30 ఏండ్ల కాలంలో మార్క్కిస్ట్ సాహిత్యం అధ్యయనం చేసేవారి సంఖ్య పెరిగిందనీ చెప్పారు. నవశకం ప్రచురణలు ఆధ్వర్యంలో బుధవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌హాల్‌లో ‘రాజకీయ అర్ధశాస్త్రం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్టుబడిదారీ విధానానికి పుట్టినిల్లు బ్రిటన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్నదనీ, లాటిన్ అమెరికాలో అభివృద్ధి నిరోధక శక్తుల్ని ఓడించి, అభ్యుదయవాదులు విజయం సాధించారనీ ఉదహరించారు. భారతదేశంలోనూ ప్రధాని నరేంద్రమోడీ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రైతు ఉద్యమం తిప్పికొట్టిందని చెప్పారు. మార్క్సిస్ట్ సాహిత్యం జనంలోకి మరింత విస్త్రుతంగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అర్థశాస్త్రాలు అనేకం ఉన్నాయనీ, అదనపు విలువ, రేటును లెక్కగట్టే సైద్ధాంతిక విధాన పద్ధతిపై ప్రజలకు అర్థమయ్యేలా విశ్లేషణ జరగాలని అభిలషించారు. రాజకీయ అర్థశాస్త్రంపై సీపిఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు 90 పేజీల్లో సరళంగా రాసారనీ, కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కూడా దీనిపై పుస్తకాలు రాసారని తెలిపారు. ఎమ్మెస్ శంకరరావు (నవశకం ప్రచురణలు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్వీకే మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్ వినయకుమార్ మాట్లాడుతూ ‘రాజకీయ అర్థశాస్త్రం’ పుస్తక అనువాదం చాలా సరళమైన భాషలో ఉందన్నారు. చారిత్రక భౌతికవాదం అర్ధంకాకుండా ఏదీ అర్థం కాదని చెప్పారు. రాజకీయ అర్థశాస్త్రాన్ని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ అనువదించారనీ, మరింత సులభంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీడియోలు కూడా చేశారని వివరించారు. ఈ పుస్తకంపై కూడా ఆ తరహా వీడియోలు చేస్తే, జనంలోకి మరింత వేగంగా వెళ్లే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. వీక్షణం సంపాదకవర్గ సభ్యులు బీఎస్ రాజు మాట్లాడుతూ మార్క్సిస్ట్ అవగాహన లేకుంటే ఏదీ అర్థంకాదని అన్నారు. ఎక్కడో చిన్న మార్పు వస్తే, దాన్నే సోషలిజం అని భావిస్తే ప్రమాదమని హెచ్చరించారు. యువతరం ఇలాంటి పుస్తకాలు అనువాదం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ మార్క్సిస్ట్ అర్థశాస్త్రాన్ని సమాజానికి అన్వయించడంలో వైఫల్యం కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. ఉత్పత్తి సంబంధాలు, ఉత్పత్తి శక్తుల మధ్య దగ్గరి సంబంధాలు ఉండాలని చెప్పారు. విప్లవం లేకుండా వ్యవస్థల్ని మార్చలేమని స్పష్టం చేశారు. వై కిరణ్‌చంద్ర మాట్లాడుతూ అమెరికాలో ఉత్పత్తి శక్తుల పెట్టుబడి క్రమేణా తగ్గుతూ వస్తున్నదని చెప్పారు. ప్రస్తుత యువతరం యాంటీ ఫాసిస్ట్ పుస్తకాలను విరివిగా చదువుతున్నదని తెలిపారు. ప్రపంచ చారిత్రక నేపథ్య ఘటనలు పుస్తకరూపంలో రావాలని కోరారు. పుస్తక అనువాదకులు తోలేటి జగన్మోహనరావు పుస్తక పరిచయం చేశారు.