మావి న్యూట్రిషన్‌ పాలిటిక్స్‌.. వారివి పార్టిషన్‌ పాలిటిక్స్‌

– ప్రజా కోణంలో ఆలోచించే సీఎం పథకాలు : న్యూట్రీషిన్‌ కిట్‌ల పంపిణీ ప్రారంభోత్సవంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్‌రావు
రనవతెలంగాణ-కామారెడ్డిటౌన్‌
ప్రజా సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుంటే.. కొందరు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ఆలోచిస్తున్నానని, తమవి న్యూట్రిషన్‌ పాలిటిక్స్‌ అయితే వారివి పార్టిషన్‌ పాలిటిక్స్‌ అని వైద్యా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ”కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ” పథకాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఇక్కడి నుంచి వర్చువల్‌గా మిగతా 8 జిల్లాల్లో ప్రారంభించారు. అనంతరం గర్భిణీలకు కిట్స్‌ పంపిణీ చేశారు. ఇదే కార్యక్రమంలో ఆశాలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రీషన్‌ కిట్‌.. డెలివరీ అయిన తర్వాత కేసీఆర్‌ కిట్‌తో మాతా శిశు రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనతో పుట్టిన కేసీఆర్‌ న్యూట్రీషన్‌ కిట్‌ పథకాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం చారిత్రక ఘట్టమన్నారు. ఎనీమియా (రక్త హీనత) ప్రభావంతో ఉన్న గర్భిణీల సంఖ్య 9 జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని, ఇందులో ఆదిలాబాద్‌, భద్రాద్రి, భూపాలపల్లి, జోగులాంబ, కామారెడ్డి, కుమ్రంభీం, ములుగు, నాగర్‌ కర్నూల్‌, వికారాబాద్‌ ఉన్నట్టు తెలిపారు. ఈ 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వం ఈ పంపిణీ చేపట్టినట్టు తెలిపారు. మొత్తం 1.25 లక్షల మంది గర్బిణీలకు రెండు ఏఎన్‌సీల్లో మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్టు చేసినట్టు చెప్పారు. దీని కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నదని, ప్రోటీన్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌, ఐరన్‌ను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హీమోగ్లోబిన్‌ శాతం పెంచడం న్యూట్రీషన్‌ కిట్ల లక్ష్యమని తెలిపారు. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో రెండో సారి గర్భిణులకు ఈ కిట్లను ఇవ్వనున్నట్టు తెలిపారు. న్యూట్రీషన్‌ కిట్‌లో కిలో న్యూట్రీషన్‌ మిక్స్‌ పౌడర్‌, కిలో ఖర్జూర, ఐరన్‌ సిరప్‌ 3 బాటిల్స్‌, 500 గ్రాముల నెయ్యి, ఆల్‌బెండజోల్‌ టాబ్లెట్‌, కప్పు, ప్లాస్టిక్‌ బాస్కెట్‌ ఇవ్వనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు హన్మంత్‌ షిండే, జాజుల సురేందర్‌, ఉర్దూ అకాడమీ చైర్మెన్‌ ముజీబ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ దఫేదార్‌ శోభ రాజు, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love