మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేస్తేనే పండుగ

– సంక్రాంతి రోజు ముగ్గులు వేస్తూ
– రైతు కుటుంబీకుల నిరసన
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్‌
మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేసిన రోజు మాకు అసలైన పండుగ మీ పిల్లల భవిష్యత్తు కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దు, మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయకుంటే రైతుకు ఉరే అంటూ మాస్టర్‌ప్లాన్‌ బాధిత కుటుంబీకులు ముగ్గులు వేస్తూ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. సంక్రాంతి పండుగ రోజు సైతం రైతుల నిరసనలు కొనసాగాయి. ఆదివారం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంతో పాటు పలు ప్రధాన రహదారులు, చౌరస్తాలపై రైతు కుటుంబీకులు ముగ్గులు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్‌ ప్లాన్‌ వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని గత 60 రోజులుగా ఉద్యమం చేసినప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో పండగ రోజు సైతం నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చిందని వాపోయారు. భూముల విషయంలో స్పష్టత వచ్చే వరకు ఉద్యమం ఆగదని అన్నారు. విలీన గ్రామాల కౌన్సిలర్లు 20వ తేదీ వరకు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేసి రైతులకు మద్దతు పలకాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం పాత రాజంపేట్‌ గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.

Spread the love