– రెండేండ్ల వరకు అనుబంధ గుర్తింపు
– నేడు ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్న కాలేజీలకు ప్రభుత్వం ఊరట కల్పించినట్టు తెలిసింది. రెండేండ్ల వరకు షరతులతో కూడిన అనుబంధ గుర్తింపును ఇస్తున్నట్టు సమాచారం. అందుకు సంబంధించిన ఉత్తర్వులు శనివారం విడుదలయ్యే అవకాశమున్నది. రాష్ట్రంలో సుమారు 435 ప్రయివేటు జూనియర్ కాలేజీలు మిక్స్డ్ ఆక్యుపెన్సీలో ఉన్నాయి. వాటిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో కలిపి సుమారు 1.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు అవుతున్నా ఇప్పటి వరకు ఆ కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపును ప్రకటించకపోవడం గమనార్హం. దీంతో ఆయా కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు, విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి, విద్యా మంత్రి, అధికారులకు తెలంగాణ ప్రయివేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం (టీపీజేఎంఏ) అధ్యక్షులు గౌరీ సతీశ్ నేతృత్వంలో పలుమార్లు విజ్ఞాపన పత్రాలను అందజేశారు. అయితే విద్యామంత్రి పి సబితా ఇంద్రారెడ్డి స్పందించి షరతులతో కూడిన అనుబంధ గుర్తింపు ఆ కాలేజీలకు ఇస్తామంటూ గతంలోనే హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా మంత్రిని టీపీజేఎంఏ నాయకులు కలిసి సమస్యను పరిష్కరించాలని కోరారు. అందులో భాగంగా ప్రభుత్వం ఆయా కాలేజీలకు గుర్తింపును ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలిసింది.