మినీ మేడారం జాతరకు భగీరథ శుద్ధి నీళ్ళు

– సిఈ శ్రీనివాస్
– 22.40 లక్షలతో త్రాగునీటి సౌకర్యం
నవతెలంగాణ -తాడ్వాయి
వచ్చే నెల ఫిబ్రవరి 1 నుండి 4వ తారీఖు వరకు జరుగు మినీ మేడారం జాతరకు వచ్చు భక్తులకు మిషన్ భగీరథ శుద్ధమైన తాగునీరు అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దీనికి జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రతిపాదికన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు పూర్తి చేశారు. మేడారం జాతర పరిసరాలలో 22.40 లక్షల నిధులతో ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూర్ నాగారం ఐటిడిఏ పిఓ అంకిత్ ల ఆదేశాల మేరకు 13 బ్యాటరీ ఆఫ్ టాప్స్, 8 సిస్టర్న్ (మినీ ట్యాంకులు), 165 చేతి పంపులు ఏర్పాటు చేశారు. జన సందోహం ఉండే ప్రదేశాలలో మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. సోమవారం మేడారంలో సి ఈ శ్రీనివాస్ ఎస్సీ మల్లేశం, ఈ ఈ సుభాష్, డి ఈ రవీందర్, ఏ ఈ ఈ నవీన్, వర్క్ ఇన్స్పెక్టర్ సుమన్, మొదలగు అధికారుల బృందం పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినీ మేడారం జాతరకు వచ్చు భక్తులకు మిషన్ భగీరథ తాగునీరు అందిస్తున్నామన్నారు. మంచినీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో మేడారం సందర్శించి సమ్మక్క సారలమ్మలను వన దేవతలను దర్శించుకుని, విడిది ప్రాంతాలలో తాగునీటి సౌకర్యాలు ఉపయోగించుకొని వంటలు తయారు చేసుకుని, భోజనాలు ఆరగించి వారు వెళ్లే విధంగా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love