సమయానుకూలంగా.. సందర్భానుసారంగా అప్పటి కప్పుడు వాగ్భాణాలను సంధించటం, తద్వారా సభను రక్తి కట్టించటం, జనాలను తన వైపునకు తిప్పుకోవటమనేది ఒక అద్భుతమైన కళ. అది అందరికీ రాదు. ఆ కళ తెలిసిన వారు మాత్రం ఏ వేదిక మీదైనా దాన్ని అలకోవగా ప్రదర్శిస్తూ సభికుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు. కొద్ది రోజుల క్రితం ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బహిరంగ సభలో గులాబీ దళపతి కేసీఆర్… ఇదే కళను ప్రదర్శించారు. సభకు ముఖ్య అతిథులుగా హాజరైన పలు రాష్ట్రాల సీఎంలు తొలుత ప్రసంగించారు. వారందరూ ఇంగ్లీషు, హిందీల్లో ఉపన్యసించారు. ఈ క్రమంలో సభలో ఉన్న కొందరు యువకులు, కేసీఆర్ అభిమానులు అదే పనిగా నినాదాలు చేయటంతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేస్తూ వారందరినీ వారించేందుకు ప్రయత్నించారు. సభలో చివరగా కేసీఆర్ మాట్లాడేందుకు లేవగానే… మళ్లీ నినాదాలు, కేకలు, కేరింతలు కొనసాగాయి. దాంతో సీఎం మైకందుకుని…’ఇంగ్లీషు, హిందీ స్పీచ్‌లు వినటానికి కూడా మీరు అలవాటు పడాలే. ఇతర రాష్ట్రాల సీఎంలు మాట్లాడేటప్పుడు ఒకటే లొల్లి చేసిన్రు. అందుకే ముందు మీ సంగతి చెబుతా… ఆ తర్వాత నా సంగతి కూడా చెప్పుకుంటా…’ అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం ఖమ్మం నగరానికి, ఆ జిల్లాలోని పలు మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తూ వరాల జల్లులు కురిపించారు. ఆ తర్వాత కొనసాగిస్తూ… ‘మీక్కావాల్సినవన్నీ ఇచ్చా.. అందువల్ల మీ పని అయిపోయింది…’ అని చెప్పారు. అప్పటిదాకా సీఎం ఎవరి మీద ఎంతటి ఆగ్రహం వ్యక్తం చేస్తారోనని ఆందోళన పడ్డ యువకులందరూ…’మీ సంగతి చూస్తానంటూ సీఎం హెచ్చరించే సరికి, ఎవరి మీద ఏం బాంబు పేల్చుతారోనని భయపడ్డాం. కానీ ఆయన భాషలో సంగతి అంటే నిధులన్నమాట…’ అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు. అదే సభలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల గురించి అడిగితే… ‘వెంటనే ఖమ్మంలోని జర్నలిస్టులందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలి…’ అంటూ వేదిక మీదున్న మంత్రులు హరీశ్‌రావును, పువ్వాడ అజరుకుమార్‌ను ఆయన ఆదేశించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ఇదే మాదిరిగా హైదరాబాద్‌తోపాటు అనేక జిల్లాల్లో సీఎం ఇదే రీతిలో విలేకర్ల ఇండ్ల స్థలాలపై హామీనిచ్చారు. కానీ ఎక్కడా.. ఏ ఒక్క జిల్లాలోనూ అది అమలు కాలే.. గట్లుంటది సర్కారు వారితోటి… -బి.వి.యన్.పద్మరాజు