ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ నామకరణం చేయాలి

– తెలంగాణ ట్రైబల్ టీచర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పొదెం కృష్ణ ప్రసాద్
– కెసిఆర్ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీని అమలుపరచాలి
– గద్దెల వద్ద పోస్టర్ ఆవిష్కరిస్తున్న ప్రజా సంఘాలు
నవతెలంగాణ- తాడాయి
ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని ములుగు జిల్లా ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజాల బిక్షపతి గౌడ్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు, తెలంగాణ ట్రావెల్ టీచర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పొదెం కృష్ణ ప్రసాద్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ నాయకులు ఇరుగుపైడి, తుడుందెబ్బ ములుగు జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ లు అన్నారు. ఆదివారం మేడారం వనదేవతల గద్దెల ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2013 నవంబర్ ఎన్నికల ప్రచారంలో ములుగుకు వచ్చిన సీఎం కేసీఆర్ సమ్మక్క సారలమ్మ దయవల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ములుగు కేంద్రంగా సమ్మక్క సారలమ్మ జిల్లా చేస్తానని కెసిఆర్ ఉద్యమ సమయంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీ తుంగలో తొక్కారని మండిపడ్డారు.
వేములవాడకు రాజన్న జిల్లా అని, గజ్వేల్ కు జోగులాంబ, కొత్తగూడెం కు భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి బొందల గడ్డకు జయశంకర్ అని పేర్లు పెట్టారని, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పేరు ములుగు జిల్లాకు ఎందుకు నామకరణం చేస్తలేరని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ములుగు జిల్లా రాయని గూడెం రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు సమ్మక్క సారక్క వారసత్వంగా వీర వనితల్లాగా ఆదివాసులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తరిమికొట్టారని, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారాయని ఇలాంటి జిల్లాకు సమ్మక్క సార్లమ్మ జిల్లాగా నామకరణం ఏం కేసీఆర్ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు?.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మేడారం వనదేవతల జాతరకు రాకపోవడం, సమ్మక్క-సారలమ్మ జిల్లాగా నామకరణం చేయకపోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ములుగు జిల్లాకు సమ్మకచర్ల నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఘట్టమ్మ వద్ద ఏర్పాటు చేసి వై టి సి ప్రాంతంలో క్లాసులు ప్రారంభించాలన్నారు. లేనిచో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ములుగు జిల్లా ఇన్చార్జి గజ్జల ప్రసాద్, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, ప్రజా సంఘాల జేసి కమిటీ సభ్యులు శ్రావణ్ కుమార్, ఆలం నాగేష్ కొమరన్న తదితరులు పాల్గొన్నారు.

Spread the love