మౌలిక సమస్యను విస్మరించిన 2023-24 కేంద్ర బడ్జెట్‌

     ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థలో కొట్టవచ్చినట్టు కనిపించే లక్షణం వాస్తవ వినిమయంలో పెరుగుదల అత్యంత హీన స్థాయిలో ఉండడమే. 2019-20 నుండి 2022-23 మధ్య కాలంలో తలసరి వాస్తవ వినిమయంలో పెరుగుదల 5శాతం కన్నా తక్కువగానే ఉంది. ఇది జీడీపీ వృద్ధి రేటు కన్నా తక్కువ. కరోనా మహమ్మారి దెబ్బ నుండి కోలుకున్న తర్వాత వాస్తవ వినిమయంలో కొద్దిపాటి పెరుగుదల కనిపించింది. అయితే అది ప్రధానంగా పెట్టుబడులు పెట్టడం ఫలితంగా వచ్చిన పెరుగుదల తప్ప వినిమయదారుల నుండి వచ్చినది కాదు. ఇటువంటి పెరుగుదల ఎక్కువకాలం పాటు నిలిచేది కాదు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం కాని, మౌలిక వసతులను సంపూర్ణంగా ఉపయోగించుకోగలగడం కాని జరగదు (కారణం: వస్తు వినియోగం పెరగకపోతే అదనంగా ఉత్పత్తి చేయవలసిన అవసరం రాదు. అప్పుడు పూర్తి స్థాపక సామర్థ్యాన్ని ఉపయోగిం చడం వీలుకాదు.) దీని ఫలితంగా బ్యాంకులకు రుణాలు సకాలంలో తిరిగిరావు. పారుబకాయిలు పెరుగుతాయి. దాని ఫలితంగా ఆర్థికవ్యవస్థ కోలుకోవడం నిలిచిపోతుంది. పైగా దేశ ఆర్థిక వ్యవస్థ మనుగడ కూడా ప్రమాదంలో పడిపోతుంది. ఇక రెండవ అంశం: ఆర్థిక వృద్ధి అనేదే మౌలికంగా సామాన్య ప్రజానీకపు జీవన ప్రమాణాలు మెరుగుపడడం కోసం. ఆ ప్రజల కొనుగోలుశక్తి పెరగనప్పుడు ఈ ఆర్థికవృద్ధిలక్ష్యానికే అర్థం లేకుండా పోతుంది.
అందువలన 2023-24 బడ్జెట్‌ ముందు ప్రధానంగా ఉండదగిన లక్ష్యం ఆర్థిక వ్యవస్థలో వినిమయాన్ని పెంపొందిం చడం. అది జరగాలంటే ప్రజా సంక్షేమ రంగాల్లో కేటాయింపు లను పెంచాలి. ఉదాహరణకు: ఒకపక్కన దేశంలో ఎఫ్‌సిఐ వద్ద ఆహారధాన్యాల నిల్వలు అలాగే పడివున్నాయి, కాని దేశంలో పేద ప్రజానీకం ఆకలితో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళ దగ్గర కొనుగోలుశక్తి లేకపోవడమే దీనికి కారణం. అప్పటికే వాళ్ళు ఆరోగ్య సంరక్షణకి, గృహవసతికి, బిడ్డల చదువులకు తమవద్దనున్న కొనుగోలుశక్తిని ఖర్చు చేసివున్నారు. అందుచేత వారి కొనుగోలుశక్తిని పెంచాలి. అంటే సంక్షేమానికి కేటాయింపులు పెంచాలి. కాని ఈ బడ్జెట్‌ ఆ పని చేయలేదు సరికదా, సంక్షేమ రంగాలకు గతంలో ఉండిన కేటాయింపులకు సైతం కోతలు పెట్టింది. ఆ విధంగా మిగిల్చిన ధనాన్ని పెట్టుబడి వ్యయాన్ని పెంచడానికి అందుబాటులోకి తెచ్చింది. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులను రూ.60,000 కోట్లకు తగ్గించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఒక దశాబ్దం క్రితం నాటి కేటాయింపు స్థాయికి ఆ పథకాన్ని తీసుకొచ్చింది. 2021-22లో ఆ పథకానికి కేటాయించినది రూ.1,12,000 కోట్లు! పైగా కొత్త నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పనులు జరిగినట్టు దాఖలాలను ఇంటర్నెట్‌ ద్వారా రికార్డు చేయాల్సివుంది. గ్రామీణ భారతంలో అత్యధిక ప్రాంతాల్లో ఆ ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు. దీనిని బట్టి ఈ పథకాన్నే మొత్తంగా ఎత్తేయాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని స్పష్టం అవుతోంది.
దేశంలో 81 కోట్లమందికి నెలకు 5కిలోల చొప్పున ఆహారధాన్యాలను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రభుత్వం చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. కాని 2022-23 బడ్జెట్‌తో పోల్చితే ఈ సారి ఆహార సబ్సిడీకి కేటాయింపుల్లో 31శాతం తగ్గించారు. అలా తగ్గించినదాంట్లో 5కిలోల ఉచిత ఆహారధాన్యాలను అందించడం అంటే తక్కిన పేదలకు అందాల్సి ఆహార సబ్సిడీలో మరింత ఎక్కువగా కోత పెట్టడమే. కొందరు పేదల కడుపులు కొట్టి తక్కిన పేదలకు పెట్టడమే. గ్రామీణాభివృద్ధి రంగానికీ కేటాయింపులు తగ్గించారు. విద్య. వైద్యం రంగాలకు కేటాయింపుల్లో నామమాత్రపు పెరుగుదల చూపించారు. కాని పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఫలితంగా ఈ రంగాలు వాస్తవంగా గతం కన్నా తక్కువ కేటాయింపులనే పొందనున్నాయి.
ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో వినిమయాన్ని పెంచడానికి వ్యతిరేకతను ప్రదర్శించింది. అంటే పేదలపట్ల వ్యతిరేకతను ప్రదర్శించింది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయం పెరుగుదల రేటు జీడీపీలో వృద్ధిరేటు కన్నా తక్కువగా ఉండబోతోంది. ప్రభుత్వ వ్యయం అంటే అందులో రాష్ట్రాలకు చేసే కేటాయింపులు కూడా కలిసేవుంటాయి. 2022-23లో ప్రభుత్వ వ్యయం (సవరించిన అంచనాల ప్రకారం) 15.3శాతం. అదే 2023-24లో 14.9శాతం మాత్రమే ఉండబోతున్నది. దాదాపు అదే మోతాదులో ద్రవ్యలోటు కూడా 6.4శాతం నుండి 5.9శాతానికి తగ్గనుంది. వినిమయాన్ని పెంచడానికి ఈ ప్రభుత్వం ఎంత విముఖంగా ఉందో అది రాష్ట్రాలకు చేసే వనరుల బదలాయింపులో కూడా కనిపిస్తోంది. 2021-22లో రూ.4,60,575 కోట్లు రాష్ట్రాలకు బదలాయించారు. అదే 2022-23లో రూ.3,67,204 కోట్లు మాత్రమే కేటాయించారు. కాని సవరించిన అంచనాలు చూస్తే వాస్తవంగా బదలాయించినది రు.3,07,204 కోట్లు మాత్రమే. ఈ ఏడాది తగ్గిన మొత్తాన్ని కూడా కలిపి 2023-24లో అదనంగా కేటాయించవలసివుండగా, వాస్తవంగా రూ.3,59,470 కోట్లు మాత్రమే కేటాయించారు. (ఇక ఇందులో వాస్తవంగా ఎంత బదలాయిస్తారో మరి?)
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు బాధ్యత వహిస్తాయి. ఎప్పుడైతే వాటికి కేటాయింపుల్లో కోత పడిందో, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజాసంక్షేమం విషయంలో వెనకాడతాయి. ఆర్థిక వసరులను ఈ విధంగా కావాలనే కేంద్రం చేతుల్లో మరింత ఎక్కువగా ఉంచుకోవడం ద్వారా ఫెడరల్‌ వ్యవస్థను కేంద్ర బడ్జెట్‌ మరింత బలహీన పరుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వ్యయాన్ని జీడీపీతో పోల్చినప్పుడు తగ్గించిన ఈ బడ్జెట్‌ పెట్టుబడివ్యయంలో బాగా పెంపును చూపించింది. ఈ బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం రూ.7.5 లక్షల కోట్లనుండి రూ.10 లక్షల కోట్లుకు పెరిగింది. ఆ విధంగా చేయడం వలన దేశాన్ని పీడిస్తున్న నిరుద్యోగసమస్యకు పరిష్కారం దొరుకుతుందని సమర్థించుకున్నారు. కాని ఆర్థికమంత్రి ఈ సందర్భంలో నాలుగు మౌలికాంశాలను మరిచిపోయినట్టున్నారు. మొదటిది: అదే మొత్తాన్ని ప్రజాసంక్షేమానికి ఖర్చు చేసినా దానివలన దాదాపు అదేస్థాయిలో ఉపాధి కల్పన జరుగుతుంది. రెండవది: ఆ విధంగా ప్రజాసంక్షేమానికి ఖర్చు చేయడం వలన నేరుగా శ్రామిక ప్రజలు లబ్ధి పొందుతారు. బడ్జెట్‌కు ముందురోజే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే శ్రామికుల వేతనాలు వాస్తవంగా తగ్గిపోయాయని అంగీకరించింది. సంక్షేమానికి ఖర్చు పెంచితే ఆ లోపాన్ని సరిచేయగలుగుతారు. మూడవది: ప్రజాసంక్షేమానికి చేసేఖర్చు ఆర్థిక వ్యవస్థమీద చేసిన ఖర్చుకి మించి కొన్ని రెట్టు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అదే పెట్టుబడివ్యయం మీద ఖర్చు చేస్తే ఆ విధమైన ప్రభావం ఉండదు. అంటే పెట్టుబడివ్యయం మీద ఖర్చు పెంచడం కన్నా సంక్షేమం మీద ఖర్చు పెంచితే (ప్రస్తుత పరిస్థితుల్లో) ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని ఎక్కువ ఉపాధి కల్పన జరుగుతుంది. నాలుగవది: పెట్టుబడివ్యయం కోసం కేటాయించిన దాంట్లో ఎక్కువభాగం యంత్రాల, టెక్నాలజీల కొనుగోళ్ళకోసం విదేశాలకు తరలిపోతుంది. ఆ మేరకు ఉపాధికల్పన జరగకుండా ఉంటుంది.
ప్రస్తుత నయా ఉదారవాద శకంలో దిగుమతులమీద ఆధారపడడం బాగా పెరిగిపోయింది. దానివలన మనదేశంలో యంత్రాల తయారీ, టెక్నాలజీ అభివృద్ధి స్తంభించిపోయాయి. అందుచేత పెట్టుబడివ్యయాన్ని పెంచినంతమాత్రాన దేశంలో ఉపాధి కల్పన జరిగిపోతుందని భ్రమపడకూడదు. దేశీయంగా ఆ పెట్టుబడి వ్యయాన్ని వినియోగించగలిగిన పరిస్థితి ఉంటే మనదేశంలో ఉపాధి కల్పన పెరుగుతుంది. అంతేకాని విదేశీ దిగుమతులకోసం పెట్టుబడివ్యయాన్ని ఎక్కువ కేటాయిస్తే ఉపాధి అదనంగా పెరిగేది చాలా స్వల్పమే. నిజంగా ఉపాధికల్పనను పెంచాలని అనుకుంటే ఆర్థికమంత్రి విదేశీదిగుమతులనుండి దేశీయ ఉత్పత్తులకు మరింత ఎక్కువ రక్షణ కల్పించి వుండాల్సింది. కాని దానికి పూర్తి విరుద్ధంగా ఆమె దిగుమతి సుంకాలను చాలా వాటి మీద తగ్గించారు. ఇంతా చేసి ఇదంతా ఉద్యోగాల కల్పన కోసమేనని సమర్థించుకోవడం కేవలం మోసకారితనం మాత్రమే.
ఇప్పుడు బడ్జెట్‌లో పెట్టుబడివ్యయాన్ని బాగా పెంచినందువలన దిగుమతులు పెరుగుతాయి. దాని ఫలితంగా విదేశీ చెల్లింపుల ఖాతాలో లోటు మరింత పెరుగుతుంది. మన రూపాయి విలువను ఎంత తగ్గించినా, ప్రపంచ వ్యాప్త ఆర్థిక మాంద్యం కారణంగా ఎగుమతులలో వృద్ధి లేదు. గత మూడు మాసాల కాలానికి లెక్క వేస్తే మన విదేశీ చెల్లింపులలో లోటు జీడీపీలో 4శాతాన్ని మించిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రజాసంక్షేమానికి కేటాయింపులను గనుక బాగా పెంచివుంటే ఒకే దెబ్బకు మూడు పిట్టలను ఈ ప్రభుత్వం కొట్టగలిగివుండేది. ఒకటి: ప్రజల కొనుగోలుశక్తిని పెంచివుండేది. రెండు: ఉపాధికల్పన పెరిగివుండేది. మూడు: విదేశీ చెల్లింపులలోటును అదుపులో ఉంచ గలిగేది. కాని ఆ మార్గాన్ని ఈ ప్రభుత్వం ఎంచుకోలేదు. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాలి. దేశంలో ఆదాయాల్లో. సంపదలో అసమానతలు బాగా పెరిగిపోయాయి. అందువలన సంపన్నులు కట్టే పన్నులు బాగా పెరుగుతాయి. జీడీపీతో పోల్చితే పన్నులద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల ఉండాలి. ఒకవేళ సంపద పన్ను విధించివుంటే ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా చేయకపోయినప్పటికీ, పన్నురాబడి గణనీయంగా పెరగాలి. కాని, ఈ బడ్జెట్‌లో ఆదాయాన్ని పెంచే చర్యలను వేటినీ ప్రతిపాదించలేదు. కొన్ని వేతన తరగతుల వారికి ఆదాయపు పన్నులో రాయితీలను ఈ బడ్జెట్‌లో ప్రకటించారు. కొంత ఆదాయాలు పొందుతున్నవారికి రాయితీలను ప్రకటించిన ఈ ప్రభుత్వం అంతకన్నా తక్కువ స్థాయి ఆదాయాలు వస్తున్న పేదలకు సంక్షేమంలో కోతలు పెట్టడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? ఇది ప్రభుత్వ వక్రదృష్టికి అద్దం పడుతోంది. మౌలికవసతుల కల్పన కోసం చేసే ఖర్చు నేరుగా ఆశ్రిత పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చుతుంది. అందుకే ఆ క్రోనీలకు మౌలిక వసతుల కల్పన అంటే అంత ఆసక్తి. ఈప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తంగా ముందుకు తీసుకుపోయే ఆలోచనతో లేదు. కార్మికవర్గ ప్రయోజనాలు అసలే దాని దృష్టిలో లేవు. ఆశ్రిత పెట్టుబడిదారుల ప్రయోజనాలకే పెద్ద పీట వేసింది. దానికే ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది.
(సరళానువాదం)
– ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love