మ్యానిఫెస్టో హామీలు అమలు చేయాలి : సీపీఐ

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించిన బడ్జెట్‌ కేటాయింపులన్నీ పూర్తిగా అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు సోమవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, గిరిజనులకు గిరిజన బంధు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ నియామక ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలనీ, ఎలక్షన్‌ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వ్యక్తి కేంద్రీకరణగా నిధులు కేటాయించాలనీ, ఇండ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలనీ, యూనివర్శిటీలు, పాఠశాలలకు నిధులు పెంచాలనీ, పంటల బీమా అమలు, కౌలు రైతులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు నిధులు పెంచాలని చెప్పారు. బీజేపీయేతర రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ప్రగతిశీలమైందనీ, అమల్లో ప్రభుత్వం విఫలమైతే వ్యతిరేక బడ్జెట్‌ అని విశ్లేషించారు.
ప్రగతి నిరోధకం-ఎమ్‌సీపీఐ(యూ)
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రగతి నిరోధక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందనీ, దీనితో కేసీఆర్‌ ఓటమి ఖాయమని ఎమ్‌సీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు ఆపాఈర్ట రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి సోమవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పూర్తి జిమ్మిక్కులతో ఉన్న ఈ బడ్జెట్‌ను తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. అంకెల గారడీ తప్ప చిత్తశుద్ధి లేదన్నారు. సకలజనుల సర్వేలో తేలిన బీసీ జనాభా సంక్షేమానికి కేవలం రూ. 6,229 కోట్లు కేటాయించటం సరికాదన్నారు. సీఎం కేసీఆర్‌ బీజేపీ మనువాద నియంతృత్వంపై పోరాటం చేస్తున్నట్లైతే, బడ్జెట్లో బీసీలకు 30 శాతం నిధులు కేటాయించి, బీసీ సబ్‌ప్లాన్‌ తెచ్చి, బీసీ కార్పొరేషన్‌ ద్వారా అభివద్ధి చేయాలన్నారు. మహిళల అభివృద్ధికి కేటాయింపులు సరిగా లేవన్నారు. విద్య, వైద్యరంగాలకు కేటాయింపులు చాలవన్నారు.

Spread the love