యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో విషాదం..

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ టీవీ యాంకర్ విష్ణుప్రియ భీమనేని కుటుంబంలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. విష్ణుప్రియ తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. తల్లి మరణించిన వార్తను విష్ణుప్రియ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తల్లిని గురించి భావోద్వేగభరిత పోస్టు పెట్టారు. ‘ఇవాళ్టి వరకు నాతో ఉన్నందుకు కృతజ్ఞతలు అమ్మా… మై డియర్ లవ్లీ అమ్మా… నీతో గడిపిన ప్రతిక్షణం నా చివరి శ్వాస వరకు గుర్తుంచుకుంటాను. నా ప్రతి శ్వాసలో నువ్వుంటావు… ఇకపై ప్రతిక్షణం నాతోనే ఉంటావు. నువ్వే నాకు బలం. నాకు మంచి జీవితం ఇవ్వడం కోసం నువ్వు చేసిన త్యాగాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అమ్మా. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అంటూ విష్ణుప్రియ పేర్కొన్నారు. తల్లితో కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు. కాగా, విష్ణుప్రియ తల్లి కూడా సినీ ఇండస్ట్రీలోనే పనిచేశారు. ఆమె గతంలో ఆర్తి అగర్వాల్, శ్రియ వంటి అగ్రశ్రేణి కథానాయికలకు హెయిర్ స్టయిలిస్ట్ గా వ్యవహరించారు. విష్ణుప్రియకు తండ్రి చిన్నప్పుడే చనిపోగా, తల్లే అన్నీ అయి పెంచింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచింది.

Spread the love