యూనివర్సిటీలకు నిధుల కేటాయింపులో అన్యాయం

– విద్యారంగం అభివృద్ధి ఎలా..? :
– ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌. మూర్తి
– రాష్ట్ర వ్యాప్తంగా నిరసన.. బడ్జెట్‌ ప్రతుల దహనం
నవతెలంగాణ-ఓయూ/విలేకరులు
యూనివర్సిటీలకు తక్కువ నిధులు కేటాయించడం అన్యాయమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎల్‌.మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగానికి, ప్రభుత్వ యూనివర్సిటీలకు రాష్ట్ర బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించినందుకు నిరసనగా ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిరసన కార్యక్రమాలు చేశారు. బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఎదుట కార్యక్రమంలో మూర్తి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఉన్నత విద్యకు తక్కువ నిధులు కేటాయించిందన్నారు. విద్యను బహుజన, బడుగు, బలహీన, మధ్యతరగతి, మైనారిటీ, పేద విద్యార్థులకు దూరం చేసే విధంగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ఓయూకు రూ.457 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, రవి నాయక్‌ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసే ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఓయూ ఉపాధ్యక్షులు రామటెంకి, శ్రీను, సాయి కిరణ్‌, కృష్ణ, రమ్య, రాజు, సందీప్‌, శ్రీనాథ్‌ సాంబశివరావు పాల్గొన్నారు. విద్యారంగాన్నికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కొర్ర సైదానాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు మూడవత్‌ జగన్‌నాయక్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆకాష్‌, సమద్‌, లోకేష్‌, ఆనంద్‌, అఖిల్‌, సాయి తదితరులు పాల్గొన్నారు. దేవరకొండలో జాతీయ రహదారిపై బడ్జెట్‌ ప్రతులను కాల్చేశారు. బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎస్‌ఎఫ్‌ఐ మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి ప్రశాంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. అరకొర నిధులతో ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి ఎలా సాధ్యమని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశ్నించారు. కామారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద బడ్జెట్‌ ప్రతులను దహనం చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల ఎదుట బడ్జెట్‌ ప్రతులను కాల్చేసి నిరసన తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ వరంగల్‌ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్‌ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని ఒకేషనల్‌ కళాశాల ఎదుట విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. డీవైఎఫ్‌ఐ వరంగల్‌ జిల్లా కార్యదర్శి ధర్మారపు సాంబమూర్తి ఆధ్వర్యంలో నాయుడు పంపు జంక్షన్‌ వద్ద నిరసన లిపారు.

Spread the love