రాకుల్‌లో ఎగిరిన ఎర్రజెండా

–  కార్మికులంతా cituసీఐటీయూ వెంటే..
–  ఓటింగ్‌కు దూరంగా హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌
–  ఏకగ్రీవంగా గెలిచిన సీఐటీయూ
నవతెలంగాణ-కోహిర్‌
సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండల పరిధిలో గల కవేలి సమీపంలోని రాకుల్‌ పరిశ్రమలో బుధవారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో సీఐటీయూ జయకేతనం ఎగురవేసింది. కార్మికులందరూ సీఐటీయూ పక్కన నిలవడంతో మిగిలిన హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌లు ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నాయి. దాంతో సీఐటీయూ ఏకగ్రీవంగా విజయం సాధించింది. కార్మికులు పెద్దఎత్తున సంబురాలు చేశారు. అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు, రాకుల్‌ పరిశ్రమ యూనియన్‌ అధ్యక్షుడు బీరం మల్లేశం మాట్లాడుతూ.. ఈ గెలుపు కార్మికుల ఐక్యతకు నిదర్శనమని, కార్మికుల ఐక్యతకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. కార్మికుల ఐక్యతతో యాజమాన్యాల మెడలు వంచవచ్చని, అనేక సౌకర్యాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. కార్మికులకు ఇచ్చిన అన్ని హామీలనూ సాధించుకునేందుకు సీఐటీయూ పోరాడుతుందన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రత, అన్ని రకాల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్‌ చందర్‌, ఎస్‌.మైపాల్‌, శివరామారావు, నర్సింహారెడ్డి, మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love