రాజ్‌భవన్‌ రాజకీయాలు మానుకోవాలి

– రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఓ పార్టీకి వంత పాడతారా? : మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/ సిరిసిల్ల క్రైం

రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఓ పార్టీకి వంతపాడుతూ రాజ్‌భవన్‌లో రాజకీయం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ గవర్నర్‌నుద్దేశించి మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చిందని, పార్లమెంట్‌ సాక్షిగా ఎన్నో వాగ్దానాలు చేసిందని తెలిపారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌ చివరిదని, తెలంగాణకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్రంలో ఉన్న నలుగురు బీజేపీ ఎంపీలు తెలంగాణకు నయాపైసా తీసుకరాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు రూ.3లక్షల 68వేల కోట్లు పన్నుల రూపేనా కేంద్రానికి చెల్లించారని, కేంద్రం మాత్రం రూ.లక్షా 68వేల కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చిందని తెలిపారు. మిగిలిన రూ.2లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆదాయాన్ని వేరే ప్రాంతంలో వాడుకున్నారని విమర్శించారు.
ఎనిమిదేండ్ల అధికారంలో కేంద్ర ప్రభుత్వం ఒక్క కొత్త రైల్వే లైన్‌ కూడా తెలంగాణకు ఇవ్వలేదని, మనోహరాబాద్‌ పాత లైన్‌ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. 9ఏండ్ల కిందట మాట ఇచ్చిన కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఊసే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లోనైనా తెలంగాణకు న్యాయం చేకూర్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు సిల్లీ మాటలు మానుకొని ఢిల్లీకి పోయి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రాధాన్యత చూడాలని సూచించారు. దేశంలో రైల్వే నెట్‌వర్క్‌లో తెలంగాణ 3 శాతం మాత్రమే ఉందని, ఇక్కడ పంటలు, ఇతర ఉత్పత్తులు ఎగుమతులు కావాలంటే రైల్వే లైన్‌ కావాలని అన్నారు. 50 శాతం కేంద్రం ఇస్తే మరో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ కొత్త స్కీమ్‌ తెచ్చారని చెప్పారు. అయినప్పటికీ తాము రైల్వే లైన్ల కోసం రూ.1904 కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం నుంచి రూ.1104 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎంపీలు కొత్త రైల్వే లైన్ల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారని, ఇక్కడ ఉన్న బీజేపీ సన్నాసులు మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని’ విమర్శించారు. తెలంగాణకు మెడికల్‌ కాలేజీ సహా నవోదయలాంటి ఏ ఒక్క కేంద్ర విద్యాలయాలు ఇవ్వలేదని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వలేదని, మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ కోసం అడుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love