రాష్ట్రాల హక్కులన్నీ కేంద్రం అధీనంలోకే…

      రాష్ట్రాల ఆదాయాన్ని క్రమంగా కేంద్రం తన నియంత్రణలోకి తీసుకున్నది. పన్నులు వసూలు చేసి వినియోగించుకోవడం రాజ్యాంగ రీత్యా రాష్ట్రాల బాధ్యతలో ఉంది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అధికారానికి వచ్చిన 2014 నుండి క్రమంగా రాష్ట్రాల ఆర్థిక హక్కులపై దాడిచేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకుంటోంది. ఆర్థిక హక్కులు కోల్పోయిన రాష్ట్రాలను కేంద్రం తమ జేబు సంస్థలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నది. ఫలితంగా ఆర్థిక స్వాతంత్య్రత కోల్పోయిన రాష్ట్రాలు, రాజకీయ స్వాతంత్య్రతను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాలు అన్ని రంగాల్లో కేంద్రంపై ఆధారపడే విధంగా ప్రస్తుత కేంద్ర విధానాలు అమలు జరుగుతున్నాయి.
రాజ్యాంగం ప్రకారం కేంద్రానికి 4 ప్రధాన బాధ్యతలున్నాయి. 1. కరెన్సీ ప్రింటింగ్‌ 2. ఎగుమతి – దిగుమతుల అమలు 3. విదేశాంగ విధానం 4. దేశ రక్షణ. వీటితోపాటు విశ్వ విద్యాలయాల నిర్వహణ ఉన్నప్పటికీ ప్రాథమిక ఉన్నత విద్య రాష్ట్రాల జాబితాలో కూడా ఉంది. కానీ నేడు కేంద్రం రాష్ట్రాల హక్కులైన 1. వ్యవసాయం 2. విద్యుత్‌ 3. పన్నులు 4. నీటి వనరులు 5. విద్య మొదలగు వాటినన్నిటినీ పార్లమెంటులో చట్టాలు చేసి తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. కేంద్ర విధానాలను వ్యతిరేకించిన రాష్ట్రాలను ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడమేగాక, రాజకీయంగా ఫిరాయింపులను ప్రోత్సహించి పాలన కొనసాగిస్తున్నది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో మత సామరస్యాన్ని కొనసాగించడానికి బదులు దాన్ని విచ్ఛిన్నం చేసి మత తగాదాలను సృష్టిస్తున్నది. మనువాద సిద్ధాంతాన్ని అమలుచేసి దేశాన్ని 2వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నది.
ఆర్థిక హక్కులు కాజేయడం
ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి, దాని స్థానంలో నిటి అయోగ్‌ తెచ్చింది. ప్రణాళికా బద్ధంగా దేశాన్ని అభివృద్ధి చేయడానికి 1951 నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక ప్రణాళికను రూపొందించి, ప్రణాళికలో రూపొందించిన కార్యక్రమాలను అమలు జరుపుతూ అభివృద్ధిలోకి రావడం జరిగింది. ప్రతీ ప్రణాళికకు నిధులు కేటాయించి ఆయా రంగాలను అభివృద్ధి పర్చడం జరిగింది. నిటి అయోగ్‌ ఏర్పడిన తర్వాత రాష్ట్రాల ఆర్థిక హక్కులను కాజేయడం మొదలైంది. ప్రణాళికా బోర్డు రద్దుతో క్రమంగా దేశాభివృద్ధి కుంటుబడింది. కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెట్టడం మొదలైంది. ప్రస్తుతం 120 భారీ పరిశ్రమలను కార్పొరేట్‌ సంస్థలకు అమ్మివేశారు. లక్షల కోట్ల లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు వారికి అప్పజెప్పడంతో ఆ సంస్థల యజమానులు ప్రపంచ ధనికవర్గంలో చేరిపోయారు. ప్రజలు మాత్రం దారిద్య్రంలో మునిగిపోతున్నారు. అయినా ఆ అమ్మకపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.
జీఎస్టీ ఏర్పరచి రాష్ట్రాల పన్నుల ఆదాయాన్ని తగ్గించడం
మార్చి 1998 నుండి మే 2004 వరకు అటల్‌ బీహారీ వాజ్‌పారు ప్రధానిగా ఉన్న కాలంలో జీఎస్టీ ప్రతిపాదన తెచ్చారు. ఒకేదేశం – ఒకేపన్ను విధానాన్ని రూపొందించి బహు పన్నుల విధానాన్ని రద్దు చేయాలని సెలవిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఇప్పుడు తమ మందబలంతో బిల్లును ఆమోదింపజేసుకుని, జీఎస్టీ కౌన్సిలు ఏర్పాటుచేసి ముఖ్యమంత్రులను, రాష్ట్రాల ఆర్థిక మంత్రులను సభ్యులుగా చేశారు. 2015 నుండి జీఎస్టీని కౌన్సిల్‌ నిర్వహించి అమలు చేస్తున్నారు. 3శాతం, 5శాతం, 8శాతం, 12శాతం, 28శాతంగా కేటగిరీలను నిర్ణయించారు. గతంలో వచ్చే ఆదాయం తగ్గినచో ఆ రాష్ట్రాలకు ఐదు సంవత్సరాల వరకు పరిహారం చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని అమలు జరపడానికి నిధుల కొరతను కారణంగా చూపుతున్నారు. ప్రతిపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాలకు నిధుల విడుదలలో జాప్యం చేయడంవల్ల ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవా కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. జీఎస్టీలో కేంద్రం పన్ను, రాష్ట్రాల పన్ను, సమగ్ర పన్నుల పేర్లతో వసూళ్ళు సాగిస్తున్నారు. కేంద్రంతో సమానంగా రాష్ట్రాల పన్నును వసూలు చేస్తున్నప్పటికీ కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాలకు ఆదాయం తగ్గింది.
ఆర్థిక కమిషన్లు
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక కమిషన్లు వేసి తమకు వచ్చే పన్నుల్లో కొంతభాగాన్ని రాష్ట్రాలకు గతంలో నుండి ఇస్తున్నది. ప్రస్తుతం 15వ ఆర్థిక కమిషన్‌ (2021-2026) అమలు జరుగుతున్నది. ఈ ఆర్థిక కమిషన్‌ ముందస్తుగానే రాష్ట్రాలకు పన్నుల వాటా నిర్ణయిస్తుంది. 13వ ఫైనాన్స్‌ కమిషన్‌లో (2010-15) రాష్ట్రాలకు 32శాతం వాటా ఉండగా, 14వ ఫైనాన్స్‌ కమిషన్‌లో (2016-2020) 42శాతంగా పెంచారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌లో తిరిగి తగ్గించి 41శాతంగా నిర్ణయించారు. ఉదాహరణకు 13వ ఫైనాన్స్‌ కమిషన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 7.37 శాతం వాటా ఉండగా, రాష్ట్రం విడిపోయిన తర్వాత 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం, తెలంగాణాకు 2.437 శాతానికి తగ్గించారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు 4.047శాతం, తెలంగాణకు 2.102శాతానికి మళ్ళీ తగ్గించారు. ఈ విధంగా తగ్గింపులు చేయడంతో రాష్ట్రాల ఆదాయం భాగా తగ్గిపోయింది. రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ కాలానికి రూ.2,94,514 కోట్లు కేటాయించాలని కమిషన్‌ సూచించింది. అలాగే స్థానిక సంస్థలకు, ఆరోగ్యానికి, ప్రకృతి వైపరీత్యాలకు, పాఠశాల, ఉన్నత విద్యకు, వ్యవసాయ సంస్కరణలకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కలిపి రెవెన్యూ లోటుతో సహా రూ.10,33,062 కోట్లు కేటాయించింది. అంటే ఏడాదికి రూ.2.60 లక్షల కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. ప్రస్తుతం కేంద్రానికి ఏటా రూ.27,57,820 కోట్లు పన్నుల రూపంలో వస్తున్నది. ఇందులో 10శాతం కూడా రాష్ట్రాలకు కేటాయించ లేదు. ఈ విధంగా ఫైనాన్స్‌ కమిషన్‌ రాష్ట్రాల కేటాయింపులను తగ్గిస్తూ రావడంతో స్థానిక సంస్థలకు (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు) నిధుల కొరత ఏర్పడింది. దీనికితోడు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కూడా తగ్గించింది.

వివరం               సంవత్సరం      కేటాయింపు       సంవత్సరం   కేటాయింపు
ఆహార సబ్సిడీ    2020-21               5,41,330             2022-23             2,06,831
ఎరువులు            2020-21               1,27,922             2022-23             1,05,222
పెట్రోల్‌ – గ్యాస్‌   2020-21              38,455                2022-23             5,813
ఇతరములు       2020-21               50,459                2022-23             37,773
మొత్తం                                              7,58,165                                          3,55,639
ఉపాధి హామీ పథకాన్ని రూ.1,11,171 కోట్ల నుండి రూ.73 వేల కోట్లకు తగ్గించడం జరిగింది. కేంద్రం ఆర్భాటంగా ప్రకటించిన సబ్సిడీలన్నిటికీ క్రమంగా కోత పెట్టడంతో బలహీనవర్గాల కొనుగోలు శక్తి తగ్గింది. నేటికీ 140 కోట్ల జనాభాలో 80కోట్ల మంది అర్థాకలితో ఉన్నట్లు దారిద్య్ర నివేదికలు చెబుతున్నాయి. 37 కోట్ల మంది కటిక దారిద్య్రంలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం దారిద్య్రం నిర్మూలనకు కృషి చేయకపోగా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా కార్పొరేట్లకు లాభాలు కట్టబెట్టడానికే విధానాలు రూపొందించి అమలు చేస్తున్నది.
అందులో భాగంగానే 27 బ్యాంకులను 12 బ్యాంకులుగా కుదించి నిధులను ఒకచోట పోగేసి, గతంలో అప్పులు తీసుకుని ఎగవేసిన వారికి తిరిగి రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకులను కేంద్రం పురమాయిస్తున్నది. బహిరంగంగా ఆర్థిక వేత్తలు నిరంతరం చర్చ జరుపుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం రుణాలు ఎగవేసిన వారికే మద్దతు తెలుపుతున్నది. ఇప్పటికే కార్పొరేట్లకు 12లక్షల కోట్ల రుణాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంతేకాక, ప్రభుత్వ రంగ సంస్థలను బుక్‌ వాల్యూ కన్నా తక్కువ ధరకు కార్పొరేట్‌ సంస్థలకు అంటగడుతున్నది. భారీ పరిశ్రమలైన జీవిత భీమా, గనులు, విద్యుత్‌, ఓఎన్‌జీసీ లాంటి ఆయిల్‌ సంస్థలను సైతం అడ్డగోలుగా వాటాల ఉపసంహరణల పేరుతో ప్రయివేటు వ్యక్తులకు అమ్మివేస్తున్నారు. రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మివేసి ఉద్యోగులను తగ్గించడమో, జీతాలు తగ్గించడమో చేస్తున్నారు. కార్మికుల హక్కులను మొత్తంగాను కాజేస్తున్నారు. వ్యవసాయ రంగాన్ని భూములతో సహా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి బహిరంగ ప్రయత్నాలే సాగుతున్నాయి. ఈ విధంగా రాష్ట్రాల ఆర్ధిక హక్కులను కాజేసి వాటిని దివాళా తీయించడంతోపాటు గ్రామీణ ప్రాంతాల ప్రజల ఉపాధిని కూడా దెబ్బ తీస్తున్నారు. విద్యా, వైద్యానికి దూరం చేస్తున్నారు. రాష్ట్రాల యూనియన్‌గా ఉన్న దేశాన్ని కేంద్రం హస్తగతం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్య విధానాన్ని అమలు జరిపి ఫెడరల్‌ ప్రభుత్వంగా కొనసాగించడానికి ప్రజలందరూ సమాయత్తం కావాలి.

సారంపల్లి మల్లారెడ్డి
సెల్‌:949009866

Spread the love