నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
విద్యా రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యమ సమయంలో రాష్ట్రమొచ్చాక విద్యకు ప్రతి బడ్జెట్‌లోనూ అధిక ప్రాధాన్యత ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పి ఇప్పుడు అమలు చేయడం లేదని విమర్శించారు. 2014-15లో విద్యకు బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయిస్తే 2021-23 నాటికి అది ఆరు శాతానికి తగ్గిపోయిందని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఢిల్లీ రాష్ట్రాల్లో విద్యకు 25 శాతం నిధులు కేటాయిస్తుంటే ఇక్కడ సగం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఢిల్లీలో అమలు చేస్తున్న ప్రభుత్వ విద్య విధానాన్ని మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలనీ, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.