రెండు బైక్ లు ఢీ.. ఇద్దరు మృతి

– ఒకరు అక్కడికక్కడే.. మరొకరు చికిత్స పొందుతూ..
నవతెలంగాణ – పెద్దవూర
రెండు మోటారు సైకిళ్ళు ఎదురుదురుగా ఒకదానికొకటి ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు అక్కడి కక్కడే, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. పెద్దవూర ఎస్ఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం అనుముల మండలం, పంగవాని కుంట గ్రామానికి చెందిన నీలం మహేందర్ (21) కిరాణా షాప్ ను నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అతను తన యొక్క పల్సర్ మోటార్ సైకిల్ పై ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుండి బయలుదేరి, గుర్రంపోడ్ మండలం లోని కొప్పోల్ గ్రామంలో తన బంధువులు ఇంటికి వెళ్లినాడు. అక్కడ పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా రాత్రి దాదాపు 10 గంటల సమయంలో పెద్దవూర శివారులోని ప్రత్తి మిల్లు సమీపంలోకి రాగానీనే అదే సమయంలో పెద్దవూర వైపు నుండి కొండమల్లె పల్లి వైపు వెళ్తున్న నేనావత్ లచ్చు (35) కొండ మల్లేపల్లి మండలం కోర్రోని తండా చెందిన లచ్చు తన యొక్క మోటార్ సైకిల్ పై వెళ్తూ, బండిని అజాగ్రత్త గా నడిపి మహేందర్ మోటార్ సైకిల్ ను ఎదురుగా ఢీ కొట్టినాడు. దాంతో ఇద్దరు క్రింద పడగా, ఇద్దరికీ తలకు బలమైన గాయాలు అయినాయి. మహేందర్ అక్కడికక్కడే చనిపోగా, లచ్చును సాగర్ ఆసుపత్రి కి తరలించి ప్రధమ చికిత్స చేసి అనంతరం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. సోమవారం ఉదయం 1.30 గంటలకు నేనావత్ లచ్చు మృతి చెందారని తెలిపారు. మహేందర్ అవివాహితుడు, నేనావత్ లచ్చు కి భార్య మంజుల, ఇద్దరు కుమార్తెలు వున్నారు. మహేందర్ అన్న బిక్షం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Spread the love