రెండో రోజూ మెట్రో సమ్మె

– విధులు బహిష్కరించి ఉప్పల్‌ డిపో ఎదుట ధర్నా
– వేతనాలు పెంచే వరకు సమ్మె విరమించం : ఉద్యోగులు
– ఉద్యోగులకు సీఐటీయూ మద్దతు
నవతెలంగాణ – సిటీబ్యూరో
మెట్రో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు రెండో రోజూ సమ్మె కొనసాగించారు. తమ న్యాయమైన డిమాండ్లు నేరవేర్చాలని మెట్రో టికెటింగ్‌ సిబ్బంది విధులు బహిష్కరించి బుధవారం ఉదయం 11 గంటలకు ఉప్పల్‌ మెట్రో డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే, విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ మావెన్‌ కో ఏజెన్సీ-కియోలిస్‌ సంస్థ ప్రతినిధులు నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి రోజు యాజమాన్యం చర్చలు జరిపి ప్రస్తుత వేతనానికి రూ.800 మాత్రమే పెంచుతామని, విధులకు హాజరుకాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. అయితే, వేతనం స్వల్పంగా పెంచుతామనడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. సమ్మె కొనసాగిస్తామని టికెటింగ్‌ సిబ్బంది తేల్చిచెప్పారు. మూడు కారిడార్లకు చెందిన ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్టు తెలిపారు. ఐదేండ్లుగా పని చేస్తున్నప్పటికీ వేతనాలు ఏమాత్రం పెంచకుండా తక్కువ వేతనంతో ఎక్కువ పనిగంటలు చేయిస్తూ.. శ్రమను దోపీడీ చేస్తున్నారని ఆరోపించారు. స్టేషన్‌కు 20 మంది చొప్పున మొత్తం 1000 మంది ఉద్యోగులు ఉంటారని, తమ జీవితాలతో ఏజెన్సీ నిర్వాహకులు ఆటలాడుతున్నారన్నారు. మొదటి రోజు సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులతో చర్చలు జరిపినట్టు.. విధుల్లో చేరుతున్నారని ప్రచారం చేసి తప్పుదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రయాణికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, రోజుకు 15గంటలు పని చేయించుకుంటూ సరిగా వేతనాలు చెల్లించడం లేదని, భోజన విరామం సమయం కూడా ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగాలు పోయినా పర్వాలేదు.. ఇన్నేండ్లు ఉద్యోగం చేసిన తమకు లాభం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, ఆ తర్వాతే విధుల్లో చేరుతామని తెలిపారు. వేతనాలు పెంచే వరకు సమ్మెలో ఉంటామని తెలిపారు.
విధుల్లోకి మెట్రో ఉద్యోగులు..?
సమ్మె చేస్తున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఉద్యోగులతో యాజమాన్యం చర్చలు సఫలమైనట్టు తెలుస్తోంది. వేతనం పెంపు, వీక్లీ ఆఫ్‌తోపాటు ఇతర డిమాండ్లపై చర్చించి త్వరలోనే స్పష్టత ఇస్తామని మావెన్‌ కో- కియోలిస్‌ సంస్థ ప్రతినిధులు ఉద్యోగులకు చెప్పినట్టు సమాచారం. కాబట్టి తక్షణమే విధుల్లోకి చేరాలని ప్రతినిధుల చేసిన విజ్ఞప్తి మేరకు.. మెట్రో కాంట్రాక్టు ఉద్యోగులు నేటి నుంచి విధుల్లోకి హాజరు కానున్నట్టు తెలుస్తోంది. అయితే తమ డిమాండ్లు నెరవేర్చకుంటే మరోసారి సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగులు అల్టిమేటం జారీ చేసినట్టు తెలిసింది.
మెట్రో రైల్‌ ఉద్యోగులకు సీఐటీయూ మద్దతు
మెట్రో రైల్‌ ఉద్యోగుల న్యాయమైన పోరాటానికి సీఐటీయూ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేసింది.
ఈ మేరకు అధ్యక్షకార్యదర్శులు జె.కుమారస్వామి, ఎం.వెంకటేష్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం ఆన్‌ స్కిల్డ్‌ కార్మికులకు నెలకు రూ.18,486 వేతనం ఇవ్వాలని, కానీ హైదరాబాద్‌ మెట్రో రైల్‌ యాజమాన్యం టికెటింగ్‌ ఉద్యోగులకు కేవలం రూ. 11వేల వేతనం ఇవ్వడం చాలా అన్యాయమన్నారు. కార్మికులకు కనీస వేతనాలు, చట్టపర హక్కులు కల్పించకుండా శ్రమ దోపిడీ చేస్తున్నదని పేర్కొన్నారు. ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని బెదిరించడం చాలా దుర్మార్గమన్నారు. హెచ్‌ఎంఆర్‌ యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని పేర్కొన్నారు. కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా సీఐటీయూ ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొంటుందని హెచ్చరించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగించాలని హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఉ ద్యోగులకు సీఐటీయూ పిలుపునిస్తుందని పేర్కొన్నారు.

Spread the love