ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డేగా విశిష్ట ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రపంచంలో ప్రతి సందర్భానికీ రోజులు న్నాయి. ఆ రోజుల వెనకాల కొన్ని కథలూ, అర్థాలూ, ఆశలూ, ప్రేరణలూ, మేల్కొల్పడాలూ ఉంటాయి. అలాగే పుస్తక దినోత్సవాలూ ఉన్నాయి. ఇప్పుడిది ‘ఎర్రపుస్తక దినోత్సవం’. ఎరుపంటే విప్లవ చిహ్నం. మార్పునకు సంకేతం. పుస్తకాలలో ఎరుపు పుస్తకాలు వేరుగానే ఉంటాయి. ప్రపంచంలో గొప్ప సృజనాత్మకమైన విషయం ఏదైనా ఉన్నదంటే అది పుస్తకమే అంటారు మేధావులు. మరి ఎర్ర పుస్తకమంటే, నిత్యం శ్రమ చేస్తూ ప్రపంచ ప్రగతికి దోహదపడుతున్న అశేష ప్రజానీకపు ఆలోచనల అనుభవాల ఆశయ గుచ్ఛం. మానవులందరూ ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణాలేమిటో తెలిపి, వాటిని పరిష్కరించే మార్గాన్ని సత్యాన్వేషణ ద్వారా విశదపరిచే భావాల ఆచరణ సంపుటి. అందుకే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డేగా నిర్వహించుకొంటూ సామూహిక పఠనం చేపడు తున్నారు. అంటే మనం తప్పక చదవాల్సిన, మన మనుగడ గురించిన గ్రంథాలను ఈ సందర్భంగా ప్రచారంలోకి తెస్తున్నారు. మహోన్నత ఆశయంతో ఈ పఠన దినోత్సవాన్ని ఆరంభించారు. రెడ్‌బుక్‌డే కోరుకునేది ఏమంటే… భావ జాల రంగంలో మానవత్వంపై జరిగే అనాగరిక దాడులను, విధ్వంసాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చైతన్యాన్ని అందించడం అతి ముఖ్యమైన లక్ష్యం. అందుకు ఈ ఫిబ్రవరి 21నే ఎందుకు? అంటే, ఇదే రోజున 1848లో ప్రపంచ మహోన్నత మేథా సంపన్నులు, విప్లవ యోధులు కారల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగెల్స్‌లు కలిసి పీడిత జన విముక్తి సిద్ధాంతం పోరాట ప్రణాళిక అయిన ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’ను లండన్‌లో పుస్తక రూపంలో ప్రప్రథమంగా ప్రచురించి మానవాళికి అందించారు. ఆనాటి కమ్యూనిస్టు లీగ్ తరుపున ఈ ప్రణాళికను వారు తీసుకొచ్చారు. ప్రపంచంలోని కార్మికులు, కర్షకులు చేసిన పోరాటంలో ప్రణాళికాంశాలు ఎంతగానో ఉపయోగ పడ్డాయి. ప్రపంచాన్ని వ్యాఖ్యానించటం కాదు, దాన్ని మార్చాలి అని చెప్పిన మొదటి పుస్తకం ఇది. ఈ ఒక్క పుస్తకం అశేష శ్రామికజనులకు, వారి విముక్తికి మహా ఆయుధాన్ని అందించింది. అదొక పిడుగయి ధ్వనించింది. ఆ పుస్తకంలోని వాక్యాలు మంటలై అంటుకున్నాయి. అందులో వివరించిన భావాలు సమాజ భవిష్యత్తును వెల్లడించాయి. కానీ అది కేవలం 23పేజీల పుస్తకం మాత్రమే.
‘కమ్యూనిస్టు ప్రణాళిక పెట్టుబడిదారీ వ్యవస్థ విధానం పొట్ట విప్పి చూపించింది. అందులోని దోపిడీ, హింస, అసంబద్ధత, అపసవ్యతలను, అమానవీయతను తేటతెల్లం చేసింది. విప్లవాత్మకమైన ఆచరణను, ఒక కొత్త ఆశను అశేష జనావళికి అందించింది. ఫిబ్రవరి 21నే జరుపుకోవటానికి మరో రెండు కారణాలున్నాయి. కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను గౌరవించు కోవటంతో పాటు ఆ రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కూడా ఒక సందర్భం. ప్రపంచ ప్రజలు తమ తమభాషలలో చదువుకోవటానికి, విజ్ఞానం పొందటానికి, పరస్పర సంబంధాలు కొనసాగించటానికి తమ మాతృభాషను ఉపయోగించుకునే హక్కు ఉన్నదని తెలిపే రోజు. ఇక మూడవ కారణం భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, లెఫ్ట్‌వర్డ్ పుస్తక రచయిత గోవింద్ పన్సారేను హత్య గావించిన రోజు ఫిబ్రవరి 20. ఆయన స్మృతికి చిహ్నంగా, మతతత్వానికి వ్యతిరేకంగా, మితవాద శక్తుల దాడులకు వ్యతిరేకంగా ఆ మరుసటి రోజును ఎర్ర పుస్తక పఠనం చేస్తున్నాం. పన్సారేను హత్య చేసినట్లుగానే ప్రజా ఉద్యమ నాయకులను, ప్రగతి శీలురను హతమారుస్తున్నారు. టునీషియాలో చోక్రీ బెలాయిడ్‌ను, దక్షిణాఫ్రికాలో క్రిస్ హనీని, బ్రెజిల్‌లో మరిల్లా ఫ్రాంకోను, జోర్డాన్‌లో నాహెడ్ హటర్‌ను, భారత్‌లో గౌరీలంకేష్, కల్బుర్గీలను ఇలా ఎంతోమంది ఉద్యమ కారులను మతోన్మాదులు పొట్టన పెట్టుకున్నారు. వారంతా ప్రపంచ ప్రగతి కోసం తమ ప్రాణాలను అర్పించారు. అందుకనే అంతర్జాతీయ లెఫ్ట్ ప్రచురణ సంస్థల సంఘం (ఇంటర్నేషనల్ యూనియన్ లెఫ్ట్ పబ్లిషర్స్) ఐయూఎల్‌పి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ఈ దినోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది.
మనదేశంలో గత కొన్ని దశాబ్దాలుగా మితవాద, మతవాద శక్తులు లెఫ్ట్ ప్రచురణ సంస్థలను, రచయితలను, ప్రచురణకర్త లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పూనుకొంటున్నది. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ రోజురోజుకూ హరించిపోతున్నది. జర్నలిస్టుల మీద, రచయితల, కవుల మీద, కళాకారుల మీద, సినిమాల మీద, కళారూపాల మీద, నటుల మీద, పాటల మీద దాడులు జరుగుతున్నవి. దేశానికి అన్నం పెట్టే రైతన్నల మీద మేధావుల మీద మతతత్వ శక్తులు దాడులకు పూనుకొంటున్నారు. అసలు రాజ్యమే మతోన్మా దానికి ఆసరాగా నిలుస్తున్నది. శాస్రీయ ఆలోచనలకు, హేతువాద ఆచరణకు విరుద్ధంగా మూఢవిశ్వాసాలను, ఆచారాలను రాజ్యమే ప్రోత్సహిస్తున్నది. కరోనా విలయ తాండవం చేస్తున్నప్పుడు దీపాలు వెలిగించమని, గంటలు కొట్టమని పిలుపునిచ్చింది. గోవు మూత్రం తాగమని చెప్పింది. బురదలో బొర్లమనీ సెలవిచ్చింది. ఇప్పుడు గోవును కౌగిలించుకొమ్మనీ ఆదేశించింది. వీటన్నింటికీ వ్యతిరేకంగా శాస్త్రీయ ఆలోచనలను ప్రచారం చేయాల్సిన అవసరం మరింత పెరిగింది. ఇప్పుడిక మౌనాన్ని వీడి గొంతులు విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే రెడ్ బుక్స్ డేను పురస్కరించుకుని సైద్ధాంతిక విషయాలపై అధ్యయనం చేయాలి. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలర్పించినవారి జీవితాలను, వారి ఆలోచనలనూ, అనుభవాలనూ చదవాలి. ప్రేరణనూ స్ఫూర్తినీ పొందాలి.
ఈ ఫిబ్రవరి 21న రెడ్‌బుక్స్‌డేను భగత్‌సింగ్ ఆలోచన లను జీవితాన్ని అధ్యయనం చేయాలని నిర్ణయం జరిగింది. నేడు మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్న సందర్భంలో పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ఆటంకాలను కలిపిస్తూ హక్కులను కాలరాస్తున్న పరిస్థితిలో భగత్‌సింగ్ ఆలోచనల అధ్యయనం మనకు దిశా నిర్దేశం చేస్తుంది. ”భారత స్వాతంత్య్ర సమరయోధుల్లోను, విప్లవకారులు, సోషలిస్టులలోనూ అగ్రశ్రేణికి చెందిన వారిలో భగత్‌సింగ్ ఒకరు. అంతేకాదు, మన దేశంలో మొట్టమొదటి మార్క్సిస్టు సిద్ధాంత ఆలోచనాపరులలో కూడా భగత్‌సింగ్ ఒకరు. అయితే ఆయన మార్క్సిస్టు దృక్పథాన్ని కలిగి ఉన్నాడన్న విషయం చాలామందికి తెలియదు. ఆ కారణంగానే భగత్‌సింగ్ మొదలగు ఆయన సహచరులకు మన దేశంలో గల బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలను రకరకాల అభివృద్ధి నిరోధకులు, మూఢవిశ్వాసపరులు, మతోన్మాదులూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం అక్రమంగా ఉపయోగించుకోవడం జరుగుతున్నది” అని చెప్పిన ప్రముఖ చరిత్రకారులు ప్రొఫెసర్ బిపిన్ చంద్ర మాటలు అక్షర సత్యం. భగత్‌సింగ్ విషయంలోనే కాదు, నేడు సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఏ రకమైన స్వాతంత్రోద్యమ వారసత్వమూ లేని మతోన్మాద శక్తులు కొందరు యోధులను తమకను కూలంగా, తమ వారిగా ముద్ర వేయించు కోవటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవిక చరిత్ర దానిని తిరస్కరిస్తుంది. అబద్ధా లతో, అసత్యాలతో చరిత్రను నిర్మించలేరు. స్వాతంత్రోద్యమ యోధుల విప్లవకర వాస్తవిక చరిత్రను, వారి ఆలోచనలనూ మననం చేయాల్సిన అవసరం నేడున్నది.
షహీద్ భగత్‌సింగ్‌ను తలచుకోగానే ఉరికొయ్యకు తలవంచని ధీరత్వం గుర్తుకొస్తుంది. స్వేచ్ఛా స్వాతంత్య్ర కాంక్ష నినాదంతో పాటుగా జన విముక్తికై గొంతెత్తి పలికిన ”ఇంక్విలాబ్ జిందాబాద్” రణధ్వని ప్రతిధ్వనిస్తుంది. త్యాగానికి వెరవని వీరత్వం స్మరణకొస్తుంది. ఆశయం కోసం అంకితమై ప్రాణాన్ని తణప్రాయంగా అర్పించిన అమ రత్వ గీతాన్ని వినిపిస్తుంది. ఆయన త్యాగధనుడే కాదు, శాస్త్రీయ ఆలోచనలతో ఈ దేశ ప్రజల విముక్తి సాధన కోసం మార్క్సిజాన్ని అధ్యయనం చేసినవాడు. ముఖ్యంగా మతం గురించి ఆయన చేసిన విశ్లేషణ ఆయనలో గల శక్తివంతమైన మేధస్సు, విప్లవ సాధన పట్ల నిబద్ధత, చారిత్రక భౌతికవాద పద్ధతిలో ఆలోచించే సామర్థ్యం మనకు కనిపిస్తాయి. ‘ప్రజలను మోసగించి తమ వర్గ ఆధిక్యతను, అధికారాన్ని న్యాయబద్ధం చేయడానికి మాత్రమే పాలక వర్గాలు, దోపిడీదారులూ మతాన్ని సృష్టించలేదని ఆయన అంటారు. ప్రజలు మన్నుతిన్న పాముల్లా పడివుండేట్లు జీవించుతూ అలా తమ వర్గాలను నిజ జీవితంలో సమర్థుల చేతుల్లో పావుల్లా పడివుండే వారిగా తయారు చేయడానికి కూడా వారు మతాన్ని వినియోగించుకుంటారని, దానికంటే మిన్నగా మతం మానవుల అశక్తత వల్లనే సృష్టింబడిందని, తన చుట్టూ వున్న సమాజ వాతావరణాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తన జీవితాన్ని తన అధీనంలో ఉంచుకోవడంలో విఫలమైనపుడు దేవుడు మానవునికి ఒక ఉపయోగకరమైన సాధనం కాగలడు’ అని ఆయన చేసిన విశ్లేషణ మార్క్స్ చేసిన రచనల అవగాహననే ప్రతిబింబిస్తుంది. ఒక చారిత్రక పరిణామంలో ఏర్పడిన మతం తాలూకు విషయాల పట్ల శాస్త్రీయ దృక్పథాన్ని భగత్‌సింగ్ ఎలా కనబరిచాడో కూడా మనకర్థమవుతుంది.
భగత్‌సింగ్ గొప్ప అధ్యయనశీలి. ఆయన ఉగ్రవాద చర్యల నుండి మార్క్సిజం వైపునకు మరలడం ప్రారంభమైన తర్వాత విపరీతంగా పుస్తకాలు చదివాడు. రష్యన్ విప్లవం పైన, సోవియట్ యూనియన్ పైనా తనకు లభ్యమైన గ్రంథాలన్నింటినీ అధ్యయనం చేశాడు. పుస్తకాలు దొరకడం కష్టమైన సందర్భంలోనూ సంపాదించి చదివాడు. పుస్తకాలు చదవడం విప్లవాత్మక చర్యగా భావించాడు. తన సహచరుల చేత చదివించడమూ చేశాడు. ”సిద్ధాంతాల అధ్యయనం ద్వారా విప్లవ కత్తి మరింతగా పదునెక్కుతుంది” అని ఉద్ఘాటించాడు. భగత్‌సింగ్ సౌందర్యారాధకుడు. సంగీత మన్నా, కళలన్నా మంచి అభిరుచి. మంచి హాస్యప్రియుడు, గొప్ప స్నేహశీలి. అంతేకాదు ఆయన రాసిన వ్యాసాలు, కరపత్రాలు, ‘నవ జవాన్ భారత్ సభ ప్రణాళిక’ మొదలైనవన్నీ అతని భాషా నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. ఆ విప్లవ వీరుని జీవన గమనాన్ని చూసి, అతనితో నడిచిన శివవర్మ రచించిన ఈ పుస్తకం భగత్సింగ్ జీవితాన్ని, అతని ఆలోచనలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. శివవర్మ తదనంతరం కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)లో పనిచేశారు. ఫిబ్రవరి 21 రెడ్ బుక్స్ డే సందర్భంగా విప్లవ వీరుని చదవడం మహౌత్తేజాన్ని అందిస్తుంది. మతతత్వ ఫాసిస్టు శక్తుల ఆలోచనలు ప్రబలుతున్న సందర్భంలో స్వాతంత్ర సమరయోధులు, విప్లవకారులు కోరుకున్న సమాజ నిర్మాణం జరగకపోగా తిరోగమనం పాలవుతున్న తీరు అవగతమవు తుంది. కర్తవ్యమూ బోధపడుతుంది. వారి జీవితాలు మన ఆచరణకు స్ఫూర్తినిస్తాయి.
రెడ్‌బుక్స్ డే లక్ష్యాల్లో ముఖ్యమైనటువంటి మానవీ యతను నిలబెట్టుకోవటం, అందుకు నేడు ఎదురవుతున్న సవాళ్ల పట్ల అవగాహనను పెంచుకుని సైద్ధాంతిక అధ్య యనం చేయాల్సిన అవసరం ఉంది. భగత్‌సింగ్ జీవితం, ఆలోచనలు మనకది అందిస్తాయి. ఫిబ్రవరి 21 నుంచి భగత్‌సింగ్ వర్థంతి మార్చ్ 23 వరకు అధ్యయన మాసోత్స వంగా ఈ రెడ్‌బుక్ డేను జరుపుకోవటం వల్ల భావితరాలకు విప్లవ చైతన్యాన్ని అందించగలుగుతాం! ప్రేరణాత్మక జీవితం భగత్‌సింగ్‌ది. మన ఆచరణకు ఆలోచనకు పదును పెంచుతుంది. ఇదొక ఆధ్యయనోత్సవం కుట్రలపై కుటిల త్వాలపై, అబద్దాలపై, అసత్యాలపై చేసే అక్షర యుద్ధం. పుస్తకం చదివేది చదువుకోసమే కాదు, సమాజ దుష్టత్వాన్ని తరిమికొట్టేందుకు. మంచి వైపు నిలబడేందుకు. ‘రెడ్‌బుక్స్ డే’ వర్థిల్లాలి! సెల్: 9948787660
కె ఆనందాచారి