‘రెడ్‌ బుక్స్‌ డే’కు జేజేలు!!

‘రెడ్‌ బుక్స్‌ డే’గా పేరుగాంచిన ఫిబ్రవరి 21ని అసలెందుకు జరుపుకుంటారు! దీని వెనకాలున్న కథాకమామీషు ఏమిటి? అని చాలామందికి సందేహం కలుగవచ్చు. అవును సందేహాలను తీర్చుకోవాల్సిందే. ప్రపంచంలో ప్రతిదానికీ రోజులున్నాయి. ఆ రోజుల వెనకాల కొన్ని కథలూ, అర్థాలూ, ఆశలూ, ప్రేరణలూ, కదిలించడాలూ, మేల్కొల్పడాలూ వుంటాయి. ఉదాహరణరకు మేడే అంటే కార్మికుల దినోత్సవం. వారి శ్రమకు తగిన ప్రతిఫలానికీ, శ్రమకాలానికీ సంబంధించిన పోరాటంలో శ్రామికుల రక్తం చిందిన రోజు. హక్కులు సాధించిన రోజు. అది ప్రపంచ కార్మికులందరికీ ఓ పండుగ రోజు. అలాగే పుస్తక దినోత్సవాలూ వున్నాయి. ఇప్పుడిది ‘ఎర్ర పుస్తక దినోత్సవం’. ఎరుపంటే విప్లవ చిహ్నం. మార్పుకు సంకేతం. పుస్తకాలలో ఎరుపు పుస్తకాలు వేరుగానే వుంటాయి. ప్రపంచం లో గొప్ప సృజనాత్మకమైన విషయం ఏదైనా వున్నదంటే అది పుస్తకమే అంటారు మేధావులు. మరి ఎర్ర పుస్తకమంటే, నిత్యం శ్రమ చేస్తూ ప్రపంచ ప్రగతికి దోహదపడుతున్న అశేష ప్రజానీకపు ఆలోచనల అనుభవాల ఆశయ గుచ్ఛం. మానవులందరు ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణాలేమిటో తెలిపి, వాటిని పరిష్కరించే మార్గాన్ని సత్యాన్వేషణ ద్వారా విశదపరిచే భావాల ఆచరణ సంపుటి.
అందుకే ప్రపంచం లోని ప్రతిఒక్కరూ ఫిబ్రవరి 21ని రెడ్‌ బుక్స్‌డే గా నిర్వహిం చుకొంటూ సామూహిక పఠనం చేప డుతున్నారు. అంటే మనం తప్పక చదవాల్సిన, మన మనుగడ గురించిన గ్రంథాలను ఈ సందర్భంగా ప్రచారంలోకి తెస్తున్నారు. ఈ రెడ్‌బుక్స్‌డే విశిష్టత రోజు రోజుకూ పెరుగుతున్నది. అవసరమూ పెరిగింది. మహోన్నత ఆశయంతో ఈ పఠన దినోత్సవాన్ని ఆరంభించారు. రెడ్‌బుక్స్‌డే కోరుకునేది ఏమంటే, భావజాల రంగంలో మానవత్వంపై జరిగే అనాగరిక దాడులను, విధ్వంసాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన చైతన్యాన్ని అందించడం అతి ముఖ్యమైన లక్ష్యం. అందుకు ఈ ఫిబ్రవరి 21ని ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఇదే రోజు 1848లో ప్రపంచ మహోన్నత మేధా సంపన్నులు, విప్లవ యోధులు కారల్‌ మార్క్స్‌, ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు కలిసి పీడిత జన విముక్తి సిద్ధాంతం, పోరాట ప్రణాళిక అయిన ‘కమ్యూనిస్టు మానిఫెస్టో’ను లండన్‌లో పుస్తక రూపంలో ప్రప్రథమంగా ప్రచురించి మానవాళికి అందించారు. ఆనాటి కమ్యూనిస్టు లీగ్‌ తరుపున ఈ ప్రణాళికను వారు తీసుకొచ్చారు. ప్రపంచంలోని కార్మికులు, కర్షకులు చేసిన పోరాటంలో ప్రణాళికాంశాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రపంచాన్ని వ్యాఖ్యానించటం కాదు, దాన్ని మార్చాలి అని చెప్పిన మొదటి పుస్తకం ఇది. ఈ ఒక్క పుస్తకం అశేష శ్రామికజనులకు, వారి విముక్తికి మహా ఆయుధాన్ని అందించింది. అదొక పిడుగయి ధ్వనించింది. ఆ పుస్తకంలోని వాక్యాలు మంటలై అంటుకున్నాయి. అందులో వివరించిన భావాలు సమాజ భవిష్యత్తును వెల్లడించాయి. కానీ అది కేవలం 23 పేజీల పుస్తకం మాత్రమే. ‘మేడిపండు చూడ మేలిమై వుండు పొట్టవిప్పి చూడ పురుగులుండు’ అని వేమన చెప్పినట్లుగానే కమ్యూనిస్టు ప్రణాళిక పెట్టుబడిదారీ వ్యవస్థ విధానం పొట్ట విప్పి చూపించింది. అందులోని దోపిడీ, హింస, అసంబద్ధత, అపసవ్యతలను, అమానవీయతను తేటతెల్లం చేసింది. విప్లవాత్మకమైన ఆచరణను, ఒక కొత్త ఆశను అశేష జనావళికి అందించింది. ముఖ్యంగా కార్మికులను, కర్షకులను కార్మిక వర్గంగా పేర్కొన్న పుస్తకం. ఇది మళ్ళీ మళ్ళీ చదవాల్సిన పుస్తకం. పదే పదే చర్చించాల్సిన పుస్తకం. వ్యవస్థల పరిణామాన్ని కండ్ల ముందు పెట్టినపుస్తకం. కర్తవ్యమేమిటో బోధించిన పుస్తకం. జయించేందుకో ప్రపంచముందని ప్రకటించిన పుస్తకం. ప్రకటన రుజువయిన పుస్తకం. ఒక్క మాటలో చెప్పాలంటే మానవాళినందరినీ మానవీకరించే వ్యవస్థను నిర్మించుకు నేందుకు సమాయత్తం చేసే పుస్తకం. అందుకే అది ఎర్ర పుస్తకం. అది పుట్టిన రోజే ఫిబ్రవరి 21. ఇంకా ఫిబ్రవరి 21 జరుపుకోవ టానికి రెండు కారణాలున్నాయి. భారతీయ వామపక్ష ప్రచురణ సంస్థలు రెడ్‌బుక్స్‌డేగా ఫిబ్రవరి 21ని ఎంచుకోవటానికి కమ్యూనిస్టు మేనిఫెస్టోను గౌరవించుకోవటంతో పాటు ఆ రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం కూడా ఒక సందర్భం. ప్రపంచ ప్రజలు తమ తమ భాషలలో చదువుకోవటానికి, విజ్ఞానం పొందటానికి, పరస్పర సంబంధాలు కొనసాగించటానికి తమ మాతృభాషను ఉపయోగించుకునే హక్కు వున్నదని తెలిపే రోజు. ఇక మూడవ కారణం భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, లెఫ్ట్‌వర్డ్‌ పుస్తక రచయిత గోవింద్‌ పన్సారేను హత్య గావించిన రోజు ఫిబ్రవరి 20, గోవింద్‌ పన్సారే మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ నివాసి. పేద కుటుంబంలో పుట్టిన పన్సారే ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటూ పెరిగాడు. పుస్తకాల మీద ప్రేమతో పుస్తకాల కేంద్రాలలోనే గడుపుతూ చదువుకున్నాడు. తన 19వ యేట కమ్యూనిస్టు పార్టీలో చేరడంతో మార్క్సిస్టు సాహిత్యంతో పరిచయమైంది. సోవియట్‌ సాహిత్యం పీపుల్స్‌ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురుణ ద్వారా చదువుకున్నాడు. న్యాయవాదిగా మారినపుడు కార్మికులతో, కార్మిక సంఘాలతో వారి సమస్యలపై పని చేశారు. అక్కడి కుల వ్యవస్థ గురించి, సంప్రదాయాల గురించి, మతతత్వాన్ని గురించి అవగాహన పెంచుకున్నారు. కార్మిక వర్గంతో పని చేయటం, సంస్కృతి అధ్యయనంతో వామపక్ష మేధావిగా పేరుగడించాడు. చరిత్ర వక్రీకరణ జరుగుతున్న తరుణంలో, ”శివాజీ ఎవరు?” అనే పుస్తకాన్ని రాసాడు. మతోన్మాదులు దీన్ని సహించలేకపోయారు. 2015 ఫిబ్రవరి 16న గోవింద్‌ పన్సారే, అతని భార్య ఉమా పన్సారే ఇద్దరు కలిసి ఉదయం వాకింగ్‌కు వెళ్ళిన సందర్భంలో మతోన్మాద దుండగులు వచ్చి ఇద్దరినీ కాల్చిపోయారు. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఉమా పన్సారే ప్రాణాలు దక్కాయి. కానీ ఫిబ్రవరి 20న గోవింద్‌ పన్సారే చనిపోయారు. ఆయన స్మృతి చిహ్నంగా మతతత్వానికి వ్యతిరేకంగా, మితవాద శక్తుల దాడులకు వ్యతిరేకంగా ఆ మరుసటి రోజును ఎర్ర పుస్తక పఠనం చేస్తున్నాము. పన్సారేను హత్య చేసినట్లుగానే ప్రజా ఉద్యమ నాయకులను, ప్రగతిశీలురను, పత్రికా నిర్వాహకులను, ప్రచురణకర్తలను హతమారుస్తున్నారు. టునీషియాలో చోక్రీ బెలాయిడ్‌ను, దక్షిణాఫ్రికాలో క్రిస్‌ హనీని, బ్రెజిల్‌లో మరిల్లా ఫ్రాంకోను, జోర్డాన్‌లో నాహెడ్‌ హటర్‌ను, భారత్‌లో గౌరీలంకేష్‌, కల్బుర్గీలను ఇలా ఎంతోమంది ఉద్యమకారులను మతోన్మాదులు, మితవాదులు పొట్టన పెట్టుకున్నారు. వారంతా ప్రపంచ ప్రగతి కోసం తమ ప్రాణాలను అర్పించారు. అందుకనే అంతర్జాతీయ లెఫ్ట్‌ ప్రచురణ సంస్థల సంఘం (ఇంటర్నేషనల్‌ యూనియన్‌ లెఫ్ట్‌ పబ్లిషర్స్‌) ×ఖూూ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ఈ దినోత్సవాలు నిర్వహించాలని పిలుపునిస్తోంది. మన దేశంలో గత కొన్ని దశాబ్దాలుగా మితవాద మతవాద శక్తులు లెఫ్ట్‌ ప్రచురణ సంస్థలను, రచయితలను, ప్రచురణ కర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పూనుకొంటున్నది. మన దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ రోజురోజుకూ హరించిపోతున్నది. జర్నలిస్టుల మీద, రచయితల, కవుల మీద, కళాకారుల మీద, సినిమాల మీద, కళారూపాల మీద, నటుల మీద, పాటల మీద దాడులు జరుగుతున్నవి. దేశానికి అన్నం పెట్టే రైతన్నల మీద మేధావుల మీద మతతత్వ శక్తులు దాడులకు పూనుకొంటున్నారు. అసలు రాజ్యమే మతోన్మాదానికి ఆసరాగా నిలుస్తున్నది. దేశ పాలనకు ఆధారంగా వున్న మన రాజ్యాంగాన్ని, దానిలో పొందుపర్చుకున్న హక్కులను, విలువలను ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నది. ఒక శాస్రీయ ఆలోచనలను హేతువాద ఆచరణకు విరుద్ధంగా మూఢవిశ్వాసాలను, ఆచారాలను రాజ్యమే ప్రోత్సహిస్తున్నది. కరోనా విలయతాండవం చేస్తున్నపుడు దీపాలు వెలిగించమని, గంటలు కొట్ట మని పిలుపునిచ్చింది. గోవు మూత్రం తాగమని చెప్పింది. బురదలో బొర్లమనీ సెలవిచ్చింది. ఇపుడు గోవును కౌగిలిం చుకొమనీ ఆదేశించింది. వీటన్నింటికీ వ్యతిరేకంగా శాస్త్రీయ ఆలోచనలను ప్రచారం చేయాల్సిన అవసరం మరింత పెరిగింది. ఇప్పుడిక మౌనాన్ని వీడి గొంతులు విప్పాల్సిన సమయం ఆసన్న మైంది. అందుకే రెడ్‌బుక్స్‌ డేను పురస్కరించుకుని సైద్ధాంతిక విషయాలపై అధ్యయనం చేయాలి. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలర్పించిన వారి జీవితాలను, వారి ఆలోచనలనూ, అనుభవాలనూ చదవాలి. ప్రేరణనూ స్ఫూర్తినీ పొందాలి. ఎవరి భాషలో వాళ్లు అధ్యయనం చేయాలి. ప్రగతిశీల అభ్యుదయ సాహిత్య సంస్థలను, రచనలను, పుస్తక కేంద్రాలను రక్షించుకునేందుకూ పూనుకోవాలి. 2020లో రెడ్‌బుక్స్‌డే సందర్భంగా కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను ప్రపంచ వ్యాపితంగా సామూహిక పఠనం చేపట్టారు. అనేక ప్రచురణ సంస్థలు తమ తమ భాషల్లో ‘ప్రణాళిక’ను ముద్రించి ప్రజలలోకి తీసుకువెళ్ళింది. మన దేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ రాష్ట్రాలలోని ప్రచురణ సంస్థలు విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. మన తెలుగు రాష్ట్రాలలోని లెఫ్ట్‌ ప్రచురణా సంస్థలు నవతెలంగాణ, నవచేతన, విశాలాంధ్ర, ప్రజాశక్తి, పీకాక్‌ సంస్థలు కలిసి లక్ష కాపీలు కమ్యూనిస్టు ప్రణాళికను ముద్రించి రెడ్‌బుక్‌డేలను ప్రజా సంఘాల సహకారంతో నిర్వహిం చారు. ఇదొక చరిత్రాత్మకమైన ఘట్టంగా నిలిచిపోయింది. ఇప్పుడు దీని విశిష్టత మరింత పెరిగింది. ఈ ఏడాది 2023 ఫిబ్రవరి 21న ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ పఠనాన్ని ఎంచుకున్నది. తెలంగాణలో భగత్‌సింగ్‌ చరిత్రనూ ఆయన ఆలోచనలను ‘భారత విప్లవ కెరటం భగత్‌సింగ్‌’ పేరిట శివవర్మ రాసిన పుస్త కాన్ని కొత్తగా తీసుకు వస్తున్నది నవ తెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌. నేడు కొంతమంది మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభజన సృష్టిస్తున్న సందర్భంలో పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై ఆటంకాలను కలిపిస్తూ హక్కులను కాలరాస్తున్న పరిస్థితిలో భగత్‌సింగ్‌ ఆలోచనల అధ్యయనం మనకు దిశా నిర్దేశం చేస్తుంది. ‘భారత స్వాతంత్య్ర సమర యోధు లలో, విప్లవ కారులలో అగ్రశ్రేణికి చెందిన వారిలో భగత్‌సింగ్‌ ఒకరు. అంతేకాదు, మనదేశంలో మొట్టమొదటి మార్క్సిస్టు సిద్ధాంత ఆలోచనా పరులలో కూడా భగత్‌ సింగ్‌ ఒకరు. అయితే ఆయన మార్క్సిస్టు దృక్పథాన్ని కలిగి వున్నాడన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ కారణంగానే భగత్‌సింగ్‌ మొదలగు ఆయన సహచరులకు మనదేశంలో గల బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలను రకరకాల అభివృద్ధి నిరోధకులు, మూఢ విశ్వాసాపరులు, మతోన్మాదులూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం అక్రమంగా ఉపయోగించుకోవడం జరుగుతున్నది’ అని చరిత్రకారుడు బిపిన్‌ చంద్ర అన్న మాటలు అక్షరసత్యం. ఒక్క భగత్‌సింగ్‌ విషయంలోనే కాదు, సుభాష్‌ చంద్ర బోస్‌ను, అంబేద్కర్‌నూ, వల్లభారు పటేల్‌నూ ఆవిధంగానే వినియోగించడం జరుగుతోంది. వాస్తవంగా మతం గురించిన శాస్త్రీయ అవగాహన కలిగిన వాడు భగత్‌సింగ్‌. అది దోపిడీదారులకు ఎలా ఉపయోగపడుతుందో కూడా అతని వీలునామాలో తెలియజేశాడు. భారత దేశ పరిస్థితులు, ఇక్కడ విప్లవం తీసుకు రావటం పట్ల చేసిన ఆలోచనలు, పోరాట తీరుతెన్నులు మనం తప్పక అధ్యయనం చేయాల్సినవి. భగత్‌సింగ్‌ గొప్ప అధ్యయనశీలి. రచయిత, వక్త, పోరాట యోధుడు. ఆయన బతికుంటే భారతదేశపు లెనిన్‌ అయ్యేవాడని విమర్శకులు అంటారు. అట్లాంటి భగత్‌సింగ్‌ ను గూర్చిన అధ్యయనం మనలో నూతన ఉత్సాహాన్ని, చైతన్యాన్ని కలిగిస్తుంది. తిరోగమన శక్తులపై తిరగబడటమెలాగో నేర్పుతుంది. రెడ్‌బుక్స్‌డే లక్ష్యాల్లో ముఖ్యమైనటువంటి మానవీయతను నిలబెట్టుకోవటం, అందుకు నేడు ఎదురౌతున్న అమానవీయతల పట్ల అవగాహనను పెంచుకుని సైద్ధాంతిక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. భగత్‌సింగ్‌ జీవితం, ఆలోచనలు మనకది అందిస్తాయి. ఫిబ్రవరి 21 నుంచి భగత్‌సింగ్‌ వర్థంతి మార్చ్‌ 23 వరకు అధ్యయన మాసోత్సవంగా ఈ రెడ్‌బుక్స్‌ డేను జరుపుకోవటం వల్ల భావితరాలకు విప్లవ చైతన్యాన్ని అందించ గలుగుతాం! ప్రేరణాత్మక జీవితం భగత్‌సింగ్‌ది. మన ఆచరణకు ఆలోచనకు పదును పెంచుతుంది. ఇదొక అధ్యయనోత్సవం కుట్రలపై కుటిలత్వాలపై, అబద్దాలపై, అసత్యాలపై చేసే అక్షర యుద్ధం. మనం కలిసే చోట, గ్రంథాలయంలలో, సమూహాలున్న చోట, కార్యాలయాలలో, పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రతి చోటా సమూహంగా అధ్యయనం చేద్దాం. పుస్తకం చదివేది చదువుకోసమే కాదు, సమాజ దుష్టత్వాన్ని తరిమికొట్టేందుకు. మంచి వైపు నిలబడేందుకు. ‘రెడ్‌బుక్స్‌డే’ వర్థిల్లాలి!
– కె. ఆనందాచారి

Spread the love