రేవంత్‌కు అదనపు భద్రత కల్పించండి

–  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ – హైదరాబాద్‌
టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పాదయాత్ర వేళ రాత్రిళ్లు ఆయన బస చేసేప్పుడు అదనపు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు శాఖకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి విజరుసేన్‌రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. పాదయాత్ర నేపథ్యంలో అదనపు భద్రత కల్పించేలా ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని రేవంత్‌ వేసిన రిట్‌ను కొట్టేయాలని ప్రభుత్వం కోరింది. పాదయాత్ర వేళ 69 మంది పోలీసుల భద్రత ఉందన్నారు. దీనిని రేవంత్‌ న్యాయవాది వ్యతిరేకించారు. ఆ 69 మంది అదనపు పోలీసులు ట్రాఫిక్‌ సమస్యలను చూసుకుంటారని, రేవంత్‌ రాత్రిళ్లు బస చేసేప్పుడు తగిన భద్రత లేదన్నారు. రాత్రిళ్లు బస చేసే చోట తగిన భద్రత కల్పించేలా ఉత్తర్వులివ్వాలని అభ్యర్థించారు. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులిచ్చిన హైకోర్టు విచారణను వాయిదా వేసింది.
హెచ్‌ఎండీఏకు ఊరట
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో రాంకీ నిర్మించిన నిర్మాణాలను రిజిస్ట్రేషన్లు చేయరాదని సబ్‌ రిజిస్ట్రార్‌కు గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిలిపేసింది. రాంకీ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులోని విల్లాలు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అనుమతించాలని సింగిల్‌ జడ్జి తీర్పును హెచ్‌ఎండీఏ సవాల్‌ చేసింది. ఇందులో స్టే ఆదేశాలను జారీ చేస్తూ చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. 2008లో రాంకీ సంస్థ, హెచ్‌ఎండీఏ ఎంవోయూ చేసుకున్నాయి. తర్వాత రద్దు చేసుకున్నప్పుడు రాంకీ సంస్థ రూ.100 కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. రూ.25 కోట్లు ఇచ్చింది. నిర్మాణాలు చేశాక అమ్మేయబోతుంటే హెచ్‌ఎండీఏ అడ్డుకుంది. దీనిపై రాంకీ వేసిన కేసులో సింగిల్‌ జడ్జి రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చారు. దీనిపై హెచ్‌ఎండీఏ సవాల్‌ చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను సోమవారం డివిజన్‌ బెంచ్‌ విచారించి స్టే ఇచ్చింది. విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది

Spread the love