– తగ్గిన పత్తి ధర-తెగుళ్ల భారినపడి నసిస్తున్న వరిపంటలు
– గతేడాది పత్తి ధర రూ.10 వేల పైనే..
– ఈయేడు రూ.7,550 వేలు
– రైతులకు పెట్టుబడులు గిట్టని దయనీయ పరిస్థితి
నవతెలంగాణ-బెజ్జంకి
కాయలున్న చెట్టుకే రాయి దెబ్బలన్నట్టు ఉంది నేడు దేశానికి అన్నం పెట్టే రైతన్న పరిస్థితి. అరకొరగా వచ్చిన పత్తి పంట దిగుబడిని గిట్టుబాటు ధరలేక విక్రయించుకోలేని పరిస్థితి ఒక వైపు మొగి పురుగు తెగుళ్లు సోకి వరి పంట పోలాలు నశించిపోతున్న దుస్థితి మరోక వైపు నెలకొనడంతో రైతన్నల ఆశలు ఆవిరవుతున్నాయి. ఆరుగాళం కష్టపడి పెట్టుబడులు పెట్టి అరకొరగా వచ్చిన పత్తి దిగుబడికి ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. దీంతో పండిన పత్తి దిగుబడిని విక్రయించుకోలేక ఇళ్లల్లో నిల్వ చేసుకున్నారు. మార్కెట్ యందు పత్తికి సరైన ప్రాధాన్యత లేకపోవడంతో వ్యాపారులు ముఖం చాటేశారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రెండేళ్లుగా పత్తికి ప్రాధాన్యత పెరడగం, భారీ ధరలు పలకడంతో మండలంలో పత్తిని అధికంగా సాగుచేశారు. గతేడాది దిగుబడి తక్కువగా ఉన్నా.. ధర ఉండడంతో ఆశతో పత్తిని రైతులు ఈ యేడు సాగుచేశారు. గత ఏడాది క్వింటాల్ కు రూ.10 వేలకు పైగా పలికిన ధర..ఈ ఏడాది రూ.7,550 పడిపోయింది. దీంతో ఈ ఏడాది పత్తి సాగు కలిసిరాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మండలంలో సుమారు 7 వేలు ఎకరాల్లో పత్తి,10 వేలు ఎకరాల్లో రైతులు వరి పంటలు సాగు చేశారు. అధిక వర్షాలు, వాతావరణ పరిస్థితులు, నకిలీ విత్తనాలు, తెగుల్లు తదితర కారణాలతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఈ యేడు కేవలం రెండు మూడు క్వింటాళ్లకు పరిమితమైంది. ప్రస్తుత ధరలను బట్టి ఎకరాకు రూ.12 వేలు నుంచి రూ.15 వేలు మాత్రమే వచ్చేలా ఉంది. కానీ పెట్టుబడి మాత్రం ఎకరాకు మెట్ట భూమిలో రూ.30 వేలు, తడి భూముల్లో రూ.40 వేలు వరకు ఖర్చు చేశామని రైతులు చెబుతున్నారు.
తగ్గిన కొనుగోళ్లు..
మండలంలోని పత్తిని సాగుచేసిన రైతులు దిగుబడిని విక్రయించడానికి మండలంలోని పత్తి మిల్లులకు తరలిస్తుంటారు. మార్కెట్ అనుసరించి ఇక్కడ పత్తి ధరల నిర్ణయం జరుగుతుంది. ఈ ఏడాది ధరలు తక్కువగా ఉండడంతో వ్యాపా రులు నాణ్యత పేరును ఆసరాగా చేసుకుని ధరలను మరింత తగ్గిస్తున్నారని వినికిడి.ధర నచ్చకపోతే దిగుబడిని వెనక్కి తీసుకువెళ్లాలని వ్యాపారస్తులు రైతులకు చెప్పేస్తున్నారని..దీంతో మిల్లు వరకూ తీసుకువెళ్లిన పత్తిని రైతులు ఏదో ఒక ధరకు విక్రయించి వస్తున్నారని సమాచారం.
ఇళ్లలోనే పత్తి నిల్వలు..
పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొనడంతో రైతులు పత్తి దిగుబడులను ఇళ్లకు చేర్చి నిల్వ చేశారు. కోత కోతకూ ఇళ్లలో పత్తి దిగుబడి నిల్వ పెరుగుతోందని.. గిట్టుబాటు ధర మాత్రం లభించకపోవడంతో తాము నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధర పెరుగుతోందని ఎదురుచూపులు చూసిన రైతులు అప్పుల బాధలు తాళలేక కొందరు విక్రయిస్తున్నారని తెలుపున్నారు. భవిష్యత్తులో ధర పెరుగుతుందని భావిస్తూ మరి కొందరు రైతులు గంపెడాశతో పత్తి దిగుబడిని ఇళ్లల్లో నిల్వ చేస్తున్నారు.
తెగుళ్ల భారిన వరిపంట పోలాలు..
యాసంగిలో మండలంలో వరిపంట సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు.ముందస్తుగా వరినాటు చేశామని ఊపిరిపిల్చుకుంటున్న క్రమంలో మొగిపురుగు తెగుళ్ల భారిన పడి నశించిపోతున్నాయి. యాసంగిలో వరిపంటలు తెగుళ్లు సోకడంతో ఆశించిన దిగుబడి కళగానే ఉంటుందని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి,వరి పంటలు రైతులకు మొండిచెయ్యి చూపుతున్నాయని ప్రభుత్వం అదూకోవాలని లేనిపక్షంలో దుర్భరస్థితి ఎదుర్కొటారని రైతులు దిగాలు చెందుతున్నారు.
మిల్లుల నిర్వహణ భారంగా మారింది
పత్తి పంటలపై పురుగు ఆశించడం,విత్తనాల్లో నాణ్యత లోపం వల్ల నూనె శాతం తగ్గడంతో పత్తి ధరలపై ప్రభావం చూపుతోందని పత్తి మిల్లుల యజమానులు చెబుతున్నారు.మార్కెట్ యందు పత్తి ధరల ప్రభావం వల్ల రైతులు వారి ఇళ్లలోనే పత్తి దిగుబడిని నిల్వ చేసుకుంటున్నారు. పత్తి కొనుగోల్లేక మిల్లుల వద్ద వేచి చూసుకుంటూ పడిగాపులు కాస్తున్నాం. పత్తి విత్తనాలు క్వింటాళుకు మార్కెట్ ధర .3,300 వేలు ఉంది.
మిల్లుల నిర్వహణ భారంగా మారింది.
– పత్తి మిల్లుల యాజమానులు.
ప్రభుత్వాలు ఆశలతో మోసం చేస్తున్నాయి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించే తీరు రైతులను ఆశలతో మోసం చేస్తున్నాయి.గతంలో పరిపాలన సాగించిన ప్రభుత్వాలు పంటలకు నష్టపరిహారం అందించాయి. నేటి ప్రభుత్వాలు వ్యవసాయ సాగు పరికరాలపై రాయితీలకు మంగళం పాడాయి. పత్తి దిగుబడికి ధర లేదు.. వరిపంటలు తెగుళ్లు భారినపడి నశించిపోయాయి.రైతులను అదూకునేలా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి.
– చెప్యాల శ్రీనివాస్, రైతు గుగ్గీల్ల