నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని ప్రీతిపై సీనియర్ విద్యార్థి ర్యాగింగ్‌తోపాటు లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ర్యాగింగ్, లైంగిక వేధింపులను భరించలేకనే ఎంజీఎం ఆస్పత్రిలో విధులు నిర్వహించే సమయంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని తెలిపారు. సీనియర్ విద్యార్థి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌కు పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని విమర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.