లాల్‌దర్వాజ ఆలయాభివృద్ధికి స్థానికులు సహకరించాలి

–  మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
పాతబస్తీలోని లాల్‌ దర్వాజ శ్రీసింహవాహిని అమ్మవారి ఆలయ అభివృద్ధికి స్థానిక ప్రజలు సహకరించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. మంగళ వారం మాసాబ్‌ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ విస్తరణ కోసం సేకరించాల్సిన స్థలాల యజ మానులతో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎమ్మెల్యే బలాలతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని అద్బుతంగా అభివృద్ధి చేస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ ప్రకటిం చారని, ప్రస్తుతమున్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొన్ని నిర్మాణాలను సేకరించడం కోసం గుర్తించినట్టు చెప్పారు. సంబంధిత స్థలాల యజమానులకు ప్రభుత్వం తగిన న్యాయం జరిగే విధంగా పరిహారం అందిస్తుందని, ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.9 కోట్లు విడుదల చేసినట్టు వివరించారు. ప్రభుత్వం చేపట్టే ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులకు సహకరించడం ద్వారా ఆలయ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతియేటా బోనాల ఉత్సవాల సందర్బంగా అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని, ప్రభుత్వం భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా సర్కారు తరపున పట్టువస్త్రాలనూ సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థల యజమానులు మంత్రి పిలుపుతో సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం పట్ల కమిటీ సభ్యులు మంత్రిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ చైర్మెన్‌ సురేందర్‌, సభ్యులు రాజ్‌ కుమార్‌, బద్రినాథ్‌, జగదీశ్‌, రాజు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love