– కేంద్ర మంత్రివర్గ నిర్ణయం
న్యూఢిల్లీ : 22వ లా కమిషన్ ఆఫ్ ఇండియా పదవీకాలాన్ని కేంద్ర మంత్రివర్గం ఆగస్టు 31 వరకూ పొడిగించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత లా కమిషన్ పదవీకాలం 2023 ఫిబ్రవరి 20న ముగిసింది. నవంబర్ 2022లో ప్రభుత్వం జస్టిస్ (రిటైర్డ్) రితురాజ్ అవస్థిని కమిషన్ చైర్మెన్‌గా నియమించింది. బీజేపీకి కీలకమైన సైద్ధాంతిక సమస్య అయిన యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని పరిశీలించాల్సిందిగా కమిషన్‌ను కోరే అవకాశం ఉన్నందున కొత్త చైర్మెన్ నియామకం, పొడిగింపు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. యూనిఫాం సివిల్ కోడ్‌ను 22వ లా కమిషన్ పరిశీలిస్తుందని ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టు, పార్లమెంటుకు తెలిపింది.
ఇండియా, గుయానా మధ్య విమాన సేవల ఒప్పందానికి ఆమోదం
ఇండియా, గుయానా మధ్య విమాన సేవల ఒప్పందాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం, కో-ఆపరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ గయానా ఎయిర్ సర్వీసెస్ ఒప్పందంపై సంతకం చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 3, ఆర్టికల్ 50 (ఎ), ఆర్టికల్ 56పై మూడు ప్రోటోకాల్స్‌తో పాటు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ (చికాగో కన్వెన్షన్) 1944లో సవరణలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.