– కమర్షియల్ సిలిండర్‌పై రూ.350 పెంచిన కేంద్రం
– ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే వడ్డన
– ప్రజలకు మోడీ సర్కార్ హోలీ కానుక: ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ : సామాన్యులపై మళ్లీ పెను భారం పడింది. ఇటీవలి కాలంలో కాస్త విరామం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తిరిగి బాదుడు మొదలుపెట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే వంటగ్యాస్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలన్నీ మండిపోతుంటే.. ఇక ఇప్పుడు గ్యాస్ సిలిండర్‌పైనా వడ్డన మొదలైంది. వాణిజ్య వినియోగానికి ఉపయోగించే సిలిండర్‌తో పాటు గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్‌పైనా వడ్డించింది. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమల్లోకి రానున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెరగ్గా.. కమర్షియల్ సిలిండర్‌పై రూ.350.50 మేర పెరిగింది. కమర్షియల్ సిలిందర్పై పెరిగిన రేట్లు కూడా మార్చి 1వ తేదీనే అమల్లోకి వస్తున్నట్టు ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ప్రకటించాయి. మంగళవారం వరకూ అంటే ఫిబ్రవరి 28 వరకూ హైదరాబాద్‌లో గృహ వినియోగానికి వాడే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,105 ఉండగా.. పెరిగిన ధరతో రూ.1,155కు చేరుకుంది. ఇక కమర్షియల్ సిలిండర్ విషయానికి వస్తే.. మంగళవారం వరకూ 19 కిలోల సిలిండర్ ధర రూ.1,769 ఉండగా.. బుధవారం నుంచి దీనిపై రూ.350.50 పెరిగింది. పెరిగిన ధరతో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ రేటు రూ.2,119.50కి చేరింది. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,103 ఉంది. పెరిగిన ధరతో రూ.1,153కి చేరింది. అలాగే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,769 నుంచి రూ.2,119.50కి పెరిగింది. ముంబయిలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,102.50 నుంచి రూ.1,152.50కి పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,721 నుంచి రూ.2,071.50కి పెరిగింది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,129 నుంచి రూ.1,179కి, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,870 నుంచి రూ.2,221.50కి, పెరిగింది. చెన్నైలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,118.50 నుంచి రూ.1,168.50కి, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,917 నుంచి రూ.2,268.50కి పెరిగింది. మరోవైపు విమాన ఇంధనం ధరలను 4 శాతం తగ్గించటం గమనార్హం.
సామాన్యులకు మోడీ సర్కార్ హోలీ గిఫ్ట్ :ప్రతిపక్షాల ఆగ్రహం
మూడు ఈశాన్య రాష్ట్రాలలో పోలింగ్ ముగిసిన రెండు రోజులకే వంట గ్యాస్ ధరలు పెంచడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఇది సామాన్య ప్రజలకు మోడీ సర్కార్ ఇచ్చిన హోలీ బహుమతని ఎద్దేవా చేశాయి. మోడీ ప్రభుత్వ హయాంలో సామాన్యులు ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేశారు. ఇది మోడీ ప్రభుత్వ హోలీ కానుక అని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు.
ఉపసంహరించుకోవాలి : సీపీఐ(ఎం)
వంట గ్యాస్ ధర పెంపు ఉపసంహరించుకోవా లని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ప్రకటన విడుదల చేసింది. ”దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరను మరో రూ.50 పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్ని ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతుంటే… ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యులపై ఈ పెంపు మరింత భారంగా మారుతుంది’ అని పేర్కొంది. ”ఈ పెంపుతో, ఎక్కువ మంది ప్రజలు సబ్సిడీ వంటగ్యాస్ సిలిండర్లను సైతం వదులుకుంటారు. ఇప్పటికే, ఉజ్వల యోజన కింద 10 శాతం మందికి పైగా గత ఏడాదిలో ఎలాంటి రీఫిల్ సిలిండర్లు తీసుకోలేదు. దాదాపు 12 శాతం మంది 1 రీఫిల్ మాత్రమే తీసుకున్నారు. మొత్తం 56.5 శాతం మంది కనీస వార్షిక సగటు 7 పైగా సిలిండర్లకు కేవలం 4 లేదా, అంతకంటే తక్కువ రీఫిల్‌లను మాత్రమే తీసుకున్నారు. సంవత్సరానికి 12 సిలిండర్లు తీసుకొనే అవకాశం ఉంది. కాని తీసుకోలేకపోతున్నారు” అని స్పష్టం చేసింది. ”కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను ఈ ఏడాది రెండోసారి పెంచారు. ఇది మరింత ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తూ అన్ని ప్రాసెస్ చేయబడిన ఆహార ఉత్పత్తులకు ఇన్పుట్ ఖర్చులను పెంచుతుంది” అని తెలిపింది. ఈ పెంపుదలను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.