నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, హాస్టల్ భవనాల ఆధునీకరణ, కొత్త భవనాల నిర్మాణం కోసం రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఇంత పెద్దఎత్తున నిధులు కేటాయించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అంటూ ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి విశ్వవిద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. నిధుల కేటాయింపులో వివక్షతను ప్రదర్శించింది. వర్సిటీల ప్రగతి కోసం ఒక్క రూపాయి కేటాయించక పోవడమే ఇందుకు నిదర్శనం. కానీ ఈ బడ్జెట్‌లో అన్ని విశ్వవిద్యాలయాలకూ కలిపి మౌలిక వసతుల కల్పన కోసం ప్రగతి పద్దు కింద రూ.500 కోట్లు కేటాయించడం గమనార్హం. మహిళా విశ్వవిద్యాలయానికి ప్రగతి పద్దు కింద మరో రూ.వంద కోట్లు ప్రతిపాదించింది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)కి రూ.20 కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్‌లో విశ్వవిద్యాలయాలకు ప్రగతి పద్దు కింద రూ.620 కోట్లు ప్రతిపాదించింది. 2022-23 బడ్జెట్‌లో రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలకు నిర్వహణ పద్దు కింద రూ.759.37 కోట్లు కేటాయించింది. 2023-24 బడ్జెట్‌లో నిర్వహణ పద్దు కింద రూ.849.67 కోట్లు ప్రతిపాదించింది. ప్రగతి పద్దు, నిర్వహణ పద్దు కలిపి విశ్వవిద్యాలయాలకు మొత్తం రూ.969.67 కోట్లు కేటాయించింది. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. వాటి భర్తీ కోసం ‘తెలంగాణ యూనివర్సిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు’ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించింది. అది గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నది. దాని గురించి బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రస్తావించకపోవడం గమనార్హం.